తమిళ స్టార్ హీరో అజిత్ తన మంచి మనసును మరోమారు చాటుకున్నారు. రైడింగ్ అంటే ప్రాణం ఇచ్చే అజిత్.. తోటి రైడర్‌కు ఒక ఖరీదైన బహుమతి ఇచ్చారు.
తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్లు నంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వచ్చారు. అయితే రజినీ తర్వాత నంబర్ వన్ ఎవరనేది దానిపై కోలీవుడ్‌లో ఎప్పుడూ ఆసక్తికర చర్చ సాగుతూనే వస్తోంది. అయితే ఈ పీఠం కోసం ఇద్దరు హీరోలు పోటీపడుతున్నారు. వాళ్లే తల అజిత్ కుమార్, దళపతి విజయ్. వీళ్లిద్దరికీ తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇరువురి సినిమాలు రిలీజైతే థియేటర్లు ఫ్యాన్స్‌తో నిండిపోయి జాతరను తలపిస్తాయి. ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో నంబర్ వన్ ఛైర్‌ను అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విజయ్ ఇప్పటికే నంబర్ వన్ పొజిషన్‌కు చేరుకున్నారని కోలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఆయన సినిమాల వసూళ్లను బట్టి వాళ్లు ఇది చెబుతున్నారు. కలెక్షన్ల పరంగా విజయ్ తర్వాతి పొజిషన్లో అజిత్ ఉన్నారని కోలీవుడ్ టాక్.
సినిమాల గోల కాసేపు పక్కనబెడితే.. అజిత్ తన లైఫ్‌ను సింపుల్‌గా జీవించేందుకు ఇష్టపడతారు. రైడింగ్ అంటే ప్రాణం ఇచ్చే అజిత్.. ఇటీవలే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు. మన దేశానికి పొరుగున ఉన్న నేపాల్, భూటాన్‌తో పాటు యూరప్‌లోని కొన్ని సిటీల్లోనూ బైక్‌పై ఆయన విహార యాత్ర చేశారు. అయితే నేపాల్‌లో అజిత్ బైక్ టూర్లో ఉండగా.. తోటి రైడర్ సుగత్ సత్పతి ఆయనకు సాయంగా నిలిచారు. దీంతో అతడికి అజిత్ విలువైన గిఫ్ట్ ఇచ్చారు. సుగత్ కోసం ఏకంగా రూ.12.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ సూపర్ బైక్‌ను కొనుగోలు చేశారు అజిత్. టూర్లో తనకు సాయం చేసినందుకు సుగత్కు బైక్‌ను బహుమతిగా ఇచ్చారు అజిత్. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు సుగత్. ఇంత పెద్ద సూపర్‌స్టార్‌తో టచ్‌లో ఉండటం తన అదృష్టమన్నాడు.