ఇటీవల సినీ ప్రపంచంలో విషాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రెండు నెలల క్రితం కృష్ణం రాజు కన్నుమూశారు.. ఆయన జ్ఞాపకాలు మరువక ముందే సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో కన్నుమూశారు. కృష్ణ మరణ వార్త మరువకముందే మరో సీనియర్ నటీమణి కన్నుమూశారు. సినీ సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఫ్యాన్స్ సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా పంజాబీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి దల్జీత్ కౌర్ ఖంగురా గురువారం ఉదయం కన్నుమూశారు.
గత కొంత కాలంగా పంజాబీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ నటుడు, దర్శకుడు గురీందర్ డింపీ కన్నుమూశారు. తాజాగా స్టార్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా అనారోగ్యంతో ఉదయం కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 69 ఏళ్లు. దల్జీత్ కౌర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దల్జీత్ కౌర్ 10కి పైగా బాలీవుడ్ చిత్రాలు, 70 పంజాబీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.
నటి దల్జీత్ కౌర్ ఢిల్లీకి చెందిన శ్రీ రామ్ మహిళా కాలేజ్ లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశారు. సినిమాలపై మక్కువతో పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె మొదటి చిత్రం దాజ్ 1976 లో రిలీజ్ అయ్యింది. ‘పుట్ జట్టన్ దే’, ‘కీ బాను దునియా దా’, ‘సర్పంచ్’ తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సినిమాల్లో నటించడం మానేసింది. 2001 లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో మళ్లీ సినిమాలకు విరామం ఇచ్చింది. దల్జీత్ కౌర్ ఖంగురా మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.