సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లు అనేవి సర్వసాధారణం. కానీ నలభైయేళ్ళ సినీ ప్రస్థానం కలిగిన సీనియర్ నటుడికి పబ్లిక్ లో అవమానం జరగడం అనేది బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. అనుకోకుండా నటన రంగంలోకి వచ్చి.. ఆపై 400కి పైగా సినిమాలలో నటించి.. స్టార్స్ నుండి యంగ్ హీరోల వరకూ అందరు హీరోలతో, దర్శకులతో సినిమాలు చేసి.. మంచి గుర్తింపు దక్కించుకున్న తెలుగు నటుడు బెనర్జీ.. తాజాగా ‘మా’ ఎన్నికల వివాదంపై స్పందించారు.
కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకూ ఆయన ప్రయాణాన్నితాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ని బెనర్జీ తీస్తానన్నాడు అనే పుకార్లపై స్పందిస్తూ.. ‘నాకు అలాంటి ఆలోచనే లేదు. యూట్యూబ్ లో వీడియోలు చూడాలని అలాంటివి రాస్తుంటారు. నేను ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చిరంజీవి గారి పర్మిషన్ తీసుకొని ఆయన పడిన కష్టాలు, అవమానాలు, విజయాలను సినిమాగా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను. అంతేగానీ నేను తీస్తానని చెప్పలేదు. ఆయన మంచి మనిషి. సినీ కార్మికులకే కాకుండా.. బయట వారికి కూడా ఎంతో సాయం చేస్తుంటారు’ అన్నారు.
‘మా’ ఎన్నికల సమయంలో జరిగిన వివాదంపై మాట్లాడిన బెనర్జీ.. “ప్రకాష్ రాజ్ ఏడాది ముందే నుంచే తాను చేయబోయే సేవా కార్యక్రమాల గురించి చెప్పారు. ఈ విషయం మోహన్ బాబుకు కూడా చెప్పారు. అయితే ఏమైందో తెలియదు కానీ.. విష్ణును మోహన్ బాబు తీసుకువచ్చారు. ఇప్పుడు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్‌ను చేసి.. రెండేళ్ల తరువాత విష్ణును చేద్దామని చిరంజీవి చెప్పారు. అయినా విష్ణుకు మద్దతు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. నేను కుదరని చెప్పడంతో ఎన్నికల్లో నన్ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. నేను చాలా బాధపడ్డా. అందుకే రాజీనామా చేసి బయటకు వచ్చా’ అని తెలిపారు. ప్రస్తుతం బెనర్జీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బెనర్జీ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.