60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ మహిళను వివాహమాడారు. గురువారం వీరి పెళ్లి అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.
ఆశిష్ విద్యార్థి.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన అందరికీ సుపరిచితులే. హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. దాదాపు 11 భాషల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురి, కన్నడ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 300 సినిమాల దాకా చేశారు. 20 ఏళ్ల క్రితం ఆయన బెంగాలీ నటి రాజోషీని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. కొన్నేళ్ల క్రితం అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు.
ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన ఓ రూపాలి బరోవాను ప్రేమించారు. మే 25న వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అతికొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఆశిష్ విద్యార్థి 1962లో ఢిల్లీలో జన్మించారు. తండ్రి మలయాళి కాగా.. తల్లి బెంగాలి. ఆయన 1986 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు.
తెలుగులో విలన్‌గా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముందున్నంతగా సినిమా అవకాశాలు లేవు. దీంతో ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. దేశం మొత్తం తిరుగుతూ వ్లాగ్స్ చేస్తూ ఉన్నారు. ఆ ఛానల్ సూపర్ హిట్ అయింది. మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకున్నారు. మరి, ఆశిష్ విద్యార్ధి 60 ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బరోవాను పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.