సాధారంగా సెలబ్రిటీల జీవితాల గురించి చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. వాళ్లకేమైంది ఒక్క సినిమాకు కోట్లకు కోట్లు డబ్బులు తీసుకుంటారు. కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఉంటాయి, రాజభోగాలు అనుభవిస్తారు అనుకుంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి వారు ఎంత కష్టపడ్డది మాత్రం ప్రేక్షకులకు తెలీదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే నటీ, నటులు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడిస్తుంటారు. అలాగే తన జీవితంలో ఎదుర్కొన కన్నీటి కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి గురైయ్యాడు బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్. తన చిన్నతనంలో ఇంటి మీదకి అప్పుల వాళ్లు వచ్చినప్పుడు ఏమీ చేయలేక ఏడ్చేశాను అంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు ఆమిర్ ఖాన్.
ఆమిర్ ఖాన్.. బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ హీరోగా తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. విలక్షణమైన నటనతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో తన చిన్ననాటి జీవింతలో జరిగిన చేదు అనుభవాలను పంచుకుని భావోద్వేగానికి గురైయ్యాడు. అప్పుడు నాకు 10 సంవత్సరాలు, ఆ సంవత్సరం నాన్న లాకెట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఎక్కువ మంది ప్రముఖులనే నటులుగా తీసుకోవడంతో సినిమా ఆలస్యంగా వాయిదాలు పడుతూ.. షూటింగ్ జరుపుకుంటూ వచ్చారు. దాదాపు 8 సంవత్సరాలు పట్టింది ఈ మూవీ పూర్తి అయ్యేసరికి. దాంతో నాన్న దగ్గర డబ్బులు అయిపోయి మేం రోడ్డు మీద పడేస్థితికి వచ్చాం అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు.
ఈ క్రమంలోనే అప్పులిచ్చిన వాళ్లు ఇంటికి మీదికి వచ్చి డబ్బులు ఎప్పుడిస్తావ్ అని నాన్నని అడుగుతుంటే.. నేను ఏమీ చేయలేక ఏడ్చేశాను అని భావోద్వేగానికి గురయ్యాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఆ టైమ్ లో నాన్న పడే కష్టాలను చూస్తే నాకు కన్నీరు ఆగలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఆమిర్. నటీ, నటులకు రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వకపోవడంతో వారు షూటింగ్ లకు వచ్చేవారు కాదని, దాంతో నాన్న వారిని బ్రతిమిలాడేవారని ఆమిర్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ తన జీవితంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులుగా పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ స్పానిష్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. ఆమిర్ ఖాన్ చివరిగా నటించిన చిత్రం ”లాల్ సింగ్ చడ్డా” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.