కరోనా నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదలే గగనం అయిపోయింది. ఇలాంటి సమయంలో బాక్సాఫీస్ వార్ కి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? కానీ.., ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇందుకు స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ బాక్సాఫీస్ వార్ కి సిద్ధం అవుతున్నారు. పోయిన సంవత్సరం సంక్రాంతి బరిలో మహేశ్ బాబు -అల్లు అర్జున్ మధ్య బాక్సాఫీస్ పోరు మహారంజుగా సాగింది. అదే రీతిన వచ్చే యేడాది మరోసారి బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారట ఈ క్రేజీ స్టార్స్.
పోయినేడాది సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్.. ‘సరిలేరు నీకెవ్వరు’, బన్నీ.. ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాల బాక్సాఫీస్ వార్.. సమ్థింగ్ స్పెషల్ గా నిలిచింది. పాటలు మొదలుకొని.. ఈ రెండు సినిమాలు ప్రచారం విషయంలో నువ్వా నేనా అంటూ పోటీ పడ్డాయి. ఇక.. విడుదల తర్వాత.. కలెక్షన్ల వార్ ఓ రేంజులో సాగింది. ఇప్పటికీ ఈ గొడవ ఆన్లైన్ లో జరుగుతూనే ఉంది. ఇక ఈ హీట్ చల్లారకముందే మరోసారి పోటీకి సిద్దమయ్యారట ఈ స్టార్ హీరోలు ఇద్దరు.
పోయినేడాది సంక్రాంతి తరహాలోనే.. వచ్చే యేడాది సంక్రాంతి బరిలోనూ మహేష్-బన్నీ మధ్య బాక్సాఫీస్ పోరు జరిగే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పుడు బన్నీ ‘పుష్ప’ కూడా పొంగల్ పోరులోకి దూకే అవకాశాలున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇక.. వచ్చే సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నాడు. మొత్తంమీద.. మరోసారి మహేష్, బన్నీల మధ్య బాక్సాఫీస్ సమరం.. ఏరీతిన ఏ రేంజులో సాగుతుందో చూడాలి.