ఈ మధ్యకాలంలో గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించి వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ తారల మరణాలు మరువకముందే తాజాగా కోల్ కత్తాలో మరో యంగ్ మోడల్ పూజా సర్కార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలచివేస్తోంది. పూజా వయసు 19 సంవత్సరాలని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలో మోడల్ గా పాపులర్ అయిన పూజా సర్కార్ తన అద్దె ఇంట్లో శవమై కనిపించింది.
ఆమె ఆత్మహత్యకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నెలల్లో ఓ మోడల్ ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని అనే ప్రాంతంలో నివసిస్తున్న పూజా.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తుంది. శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన పూజా.. తిరిగి రాగానే ఓ కాల్ కోసం గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది.
ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ తలుపు తెరవడానికి ప్రయత్నించి, చివరికి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా పూజ సర్కార్ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పూజా చనిపోయే ముందు తన ప్రియుడి నుంచి కాల్ వచ్చిందని ఆమె ఫ్రెండ్ చెప్పిందని పోలీసులు తెలిపారు. పూజా ప్రియుడు గోబర్దంగాలో ఉంటాడని.. ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.
పూజా సర్కార్ ఆత్మహత్యకు సంబంధించి ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని వారు తెలిపారు. పూజా మృతదేహం నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో లభ్యమైనట్లు సమాచారం. ఆమె సీలింగ్ ఫ్యాన్ కు టవల్‌తో వేలాడుతూ కనిపించిందని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే.. పూజా మృతికి బాయ్ ఫ్రెండ్ తో కాల్, గొడవే కారణమని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈ విషయం తెలిసి పూజా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.