ఈ మధ్యకాలంలో యువతీయువకులు ఎంతవేగంగా ప్రేమలో పడుతున్నారో.. అంతేవేగంగా బ్రేకప్ అంటూ విడిపోతున్నారు. బ్రేకప్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో బాధించే విషయమే. వాస్తవానికి ప్రేమించిన వ్యక్తిని వదులుకోవాలంటే ఎంతో బాధగా ఉంటుంది. అంతేగాక లవ్ బ్రేకప్ అయినప్పుడు మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. అంతటి బ్రేకప్ బాధ నుండి బయటపడటం అనేది అంత తేలికైన విషయం కాదు.
జీవితంలో బ్రేకప్ ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్పిస్తుంది. అయితే బ్రేకప్ బాధ నుండి బయటపడటం అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు మీ మాజీ ప్రియుడిని/ప్రియురాలిని మరచిపోయేందుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లొచ్చు. మరి బ్రేకప్ బాధ నుండి బయట పడేందుకు ఈ సింపుల్ మార్గాలు ట్రై చేయండి.
అంతా అయిపోయింది అనుకోవడం:
బ్రేకప్ అంటేనే మనసును బాధించే విషయం. మానసికంగా క్షోభకు గురిచేస్తుంది. జీవితాన్ని ఊహించుకున్న వారి నుండి విడిపోవడం అనేది తోబుట్టిన వారిని పోగోట్టుకున్న దానికంటే ఎక్కువ క్షోభ మిగిలిస్తుంది. లవ్ బ్రేకప్ అయితే బంధం, భవిష్యత్తు అన్నీ పోతాయి. అందుకే దుఃఖాన్ని దిగమింగి అంతా ముగిసింది అనుకోవడం చాలా మంచిది.
లోపాల పై దృష్టి పెట్టడం:
లవ్ లో బ్రేకప్ తర్వాత కష్టాలను మరచిపోతారు. విడిపోయిన బంధానికి సంబంధించి తీపి జ్ఞాపకాలను మాత్రమే గుర్తుంచుకుంటారు. ఇలాంటి సమయంలో గతం గురించి ఆలోచించే బదులుగా.. మీరు విడిపోయిన కారణాలను లిస్ట్ చేసుకోండి. మీ మాజీ ప్రియుడు/ప్రియురాలు ప్రవర్తనలో లోపాలను గుర్తించండి. బహుశా ఎక్కడో తప్పు దారిలో వెళ్లి ఉండవచ్చు.
మీ మానసిక స్థితి మార్చుకోండి:
నిజానికి మాజీ ప్రియుడు/ప్రియురాలిని మర్చిపోయే ప్రాసెస్ లో కష్టమైన విషయం ఏంటంటే.. ఇక అతను/ఆమె మీ మనిషి కాదని అంగీకరించడం. అలా కాకుండా మీ మానసిక స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయండి. మెల్లగా మీ మెదడుకు వేరే పనులు చెబుతూ ఉండాలి. వారి స్థానంలో మీ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు.. ఇలా మిమ్మల్ని ప్రేమించే వారితో టైం స్పెండ్ చేయండి. అప్పుడే మీరు బ్రేకప్ ఆలోచనల్లో నుండి బయటికి రాగలరు. ప్రేమను ప్రియుడు/ప్రియురాలు మాత్రమే కాదు పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా ఇవ్వగలరని మీ మెదడుని ట్రైన్ చేయండి.
ప్రేమలో స్నేహం వద్దు:
బ్రేకప్ అయ్యాక అందరూ చెప్పే కామన్ మాట ఫ్రెండ్స్ గా ఉందాం. వాస్తవానికి ఏ ప్రియుడు/ప్రియురాలు విడిపోయాక స్నేహితులుగా ఉండలేరని మీకు తెలుసు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కాబట్టి మీరు ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేయడమే బెటర్.
మానుకోండి:
ఎవరైనా విడిపోయాక మాజీ అయిపోతారు. కాబట్టి వారిని ఏ విధంగానూ( ఫోన్ కాల్, ఇమెయిల్, మెసేజెస్, సోషల్ మీడియా) కాంటాక్ట్ అవ్వకండి. ఒక్కోసారి కాంటాక్ట్ అవ్వాలని అనిపించే అవకాశం ఉంది. అది కరెక్ట్ కాదని మీ మనసుకు సర్ది చెప్పుకోండి. భాగస్వామి, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. కానీ ఇంత జరిగిన తర్వాత.. మాజీని కలవాలి అనుకుంటే ఖచ్చితంగా అది మీ తప్పే అవుతుంది. ముందుగా మానసిక క్షోభను తుడిచేయండి. పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ప్రతి విషయాన్నీ దూరం పెట్టండి. మీ సెల్ ఫోన్ లలో, మెయిల్ లో వారి జ్ఞాపకాలను డిలీట్ చేయడం ఉత్తమం.