గ్రౌండ్ లో హైదరాబాద్-ముంబయి జట్ల హోరాహోరీగా తలబడితే.. పైన స్టాండ్స్ లో ఫ్యాన్స్ కొట్టుకునేవరకు వెళ్లారు. ఈ వీడియో వైరల్ అయ్యేసరికి అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ పై ఓడిపోగా, తాజాగా ముంబయి ఇండియన్స్ చేతిలో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ ఆటతీరుపై చాలా అంటే చాలా విమర్శలు వస్తున్నాయి. గెలిచే అవకాశాన్ని కూడా చేజేతులా మిస్ చేసుకుందని.. సొంత అభిమానులే తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఓడిపోవడం కాదన్నట్లు.. స్టేడియంలో ఫ్యాన్స్ మధ్య గొడవ జరగడం సోషల్ మీడియాలో మరో రచ్చకు కారణమైంది.
ఇక విషయానికొస్తే.. మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల స్కోరు చేసింది. గ్రీన్ 64, తిలక్ వర్మ 37, ఇషాన్ కిషన్ 38 రన్స్ కొట్టి ఆకట్టుకున్నారు. సన్ రైజర్స్ బౌలర్లు వికెట్లు తీయడంలో తడబడటమే కాకుండా పరుగులు ధారాళంగా ఇచ్చేశారు. ఛేదనలో హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ 48 రన్స్ కొట్టాడు కానీ బంతులు చాలా తినేశాడు. కెప్టెన్ మార్క్రమ్ 22, హెన్రిచ్ క్లాసెన్ 36 రన్స్ కొట్టారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
అయితే హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో తాగుబోతులు హల్ చల్ చేశారు. వీళ్ల కారణంగా SRH, MI ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తిట్టుకుంటూ, కొట్టుకునే వరకు వెళ్లారు. పోలీసులు మధ్యలోకి వచ్చి జోక్యం చేసుకున్నా సరే వాళ్లతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు… వాళ్లని స్టేడియం నుంచి బయటకు పంపించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అంతలో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ గొడవలో ఎవరికైనా గాయాలయ్యాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి SRH vs MI ఫ్యాన్స్ గొడవపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.