పాపం కోహ్లీ! డుప్లెసిస్ గాయపడటం వల్ల ఆర్సీబీకి స్టాండ్ బై కెప్టెన్ అయ్యాడు. కానీ ఆ బ్యాడ్ లక్ మాత్రం అస్సలు మారడం లేదనిపిస్తోంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ పేరు విని చాలా అంటే చాలా రోజులైపోయింది. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ గా ఎప్పుడైతే తప్పుకున్నాడో అప్పటి నుంచి కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీకి ఎన్నో ఏళ్లపాటు కెప్టెన్ గా చేసిన విరాట్.. కప్ కొట్టలేదనే విమర్శల కారణంగా ఏమో కానీ ఈ జట్టు సారథ్య బాధ్యతలు కూడా వదిలేసుకున్నాడు. అలాంటిది ఈ సీజన్ లో పార్ట్ టైమ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ గాయంతో బాధపడుతున్నాడు. దీంతో స్టాండ్ బైగా కోహ్లీ ఉన్నడనమాట. అంతా బాగానే ఉన్నప్పటికీ ఓ విషయం మాత్రం అస్సలు మారలేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోహ్లీ కెప్టెన్ గా అద్భుతాలు చేశాడని చెప్పం గానీ ఉన్నంతలో చాలావరకు బాగానే ఆడాడు. టీమిండియా క్రికెటర్లలో ఫిట్ నెస్ తోపాటు వేగం తీసుకొచ్చాడు. కానీ ఐసీసీ ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయాడు. దీనికి తోడు గత రెండు మూడేళ్లుగా బ్యాటింగ్ లో బాగా ఫెయిలయ్యాడు. ఇలా పలు కారణాల వల్ల కెప్టెన్సీ వదిలేసుకున్నాడు. ఫన్నీగా అనిపించొచ్చు కానీ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడంటే ఆ జట్టు టాస్ కచ్చితంగా గెలవదు. టీమిండియా విషయంలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆర్సీబీ స్టాండ్ బై కెప్టెన్ అయినాసరే ఆ బ్యాడ్ లక్ అస్సలు మారట్లేదనిపిస్తోంది.
పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్, తాజాగా రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ కెప్టెన్ గా మారిపోయాడు. ఈ రెండింటిలోనూ బెంగళూరు టాస్ ఓడిపోయింది. ఈ క్రమంలోనే కోహ్లీ మాట్లాడుతూ తనపై తానే ఫన్నీ కామెంట్స్ చేశాడు. ‘జట్టుకు కెప్టెన్ గా చేయడం బాగానే ఉంది. కానీ నా టాస్ రికార్డ్ పెద్ద సమస్యగా మారిపోయింది’ అని అన్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. కెప్టెన్ గా కోహ్లీ ఉన్నప్పుడు రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. టాస్ మాత్రం కచ్చితంగా ఓడిపోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. మరి టాస్ విషయంలో కోహ్లీ తనపై తానే కౌంటర్ వేసుకోవడం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.