సినిమా హీరోల పోస్టర్లకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, పూల మాలలు వేసి డప్పు చప్పుళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఈరోజుల్లో చాలా కామన్. అదే ఓ క్రికెటర్‌కి, అది కూడా మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న క్రికెటర్‌కి హారతి పట్టి పూజలు చేయడమంటే అది హాట్ టాపిక్. చెన్నై.. లక్నో మ్యాచులో అదే జరిగింది.
ఎవరైనా, ఎక్కడైనా దేవుడిని ఆరాధిస్తారు.. నైవేద్యం పెడతారు.. హారతి ఇస్తారు. కానీ ఈ భక్తుడు అలా కాదు.. క్రికెట్‌కే వన్నెతెచ్చిన టీమిండియా మాజీ సారథి ధోనీయే తన దేవుడంటున్నాడు. అందుకోసం పనిలో పని టీవీలో స్క్రీన్ పై ధోని కనిపించగానే హారతి పట్టి పూజలు చేశాడు. ఏం పూజలు చేశాడా అనుకోకండి..చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలువాలని ప్రార్థించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎక్కడో రాంఛీలో పుట్టి, టీమిండియా కెప్టెన్‌గా మారి.. దేశానికి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీని ఆరాధ్య దైవంగా భావించే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. వీరిలో ధోనీని చూడడానికే మైదానానికి వచ్చేవారు కొందరైతే.. కనపడగానే కాళ్లపై పడిపోయేవారు, సెల్ఫీలు అడిగేవారు మరికొందరు. ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల సమయంలో బాలీవుడ్ సింగర్ అర్‌జిత్ సింగ్, ‘ఓం దేవా.. దేవా… నమః’ అని పాడుతుండగానే బిగ్ స్క్రీన్‌పై మాహీ కనిపించడం, స్టేడియంలో ఉన్న లక్ష మంది జనం.. ఒక్కసారిగా అరవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అర్‌జిత్ సింగ్ ధోనీ కాళ్లపై పడిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ధోని అంటే అంత క్రేజ్.
బ్యాటర్‌గా, కీపర్‌గా, సారథిగా.. ధోనీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అంతేకాదు.. ఐపీఎల్‌లో తన జట్టైన చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరుగులేని విజయాలు అందించిపెట్టాడు. అందుకే చెన్నై అభిమానులకు ధోనీ అంటే పిచ్చి. అందుకే ముద్దుగా ధోనీని తలైవా అని పిలుచుకుంటారు. మూడేళ్ల క్రితం తమిళనాడులోని కడలూరు జిల్లా అరంగూరుకు చెందిన గోపీ కృషన్ తన ఇంటిని చెన్నై జట్టు జెర్సీ కలర్ అయిన పసుపు రంగులోకి పూర్తిగా మార్చేసి ధోనీ ఫ్యాన్ ఇల్లు అని రాయించాడు. ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అదో సెన్సేషనల్ న్యూస్. మూడేళ్లు గడిచాక మరోసారి ఆ అభిమానం బయటపడింది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఓ యువకుడు టీవీలో మాట్లాడుతున్న ధోనీకి హారతి ఇస్తూ ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్రార్థించాడు. మరి అతడి ప్రార్థనలు ఫలించి ఈ మ్యాచ్‌తో చెన్నై బోణీ కొడుతుందో, లేదో చూడాలి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This is why Cricket is considered as Religion in India.🫶🏻#CSKvsLSGpic.twitter.com/jjWLOecOCE
— Aayushi🏏 (@cric_aayushi) April 3, 2023