మీకు తెలుసా? ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువని. అది కూడా చిన్న వయసులో మరణిస్తున్నారు. 50 కంటే తక్కువ వయసున్న వారు 50 శాతం మంది గుండెపోటు వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి కారణం ఏంటి?
ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. చాలా చిన్న వయసులో గుండెపోటుతో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈయన విషయంలోనే కాదు.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ శుక్ల ఇలా వీళ్ళందరూ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు. వీళ్ళందరికీ 50 లోపే వయసు ఉంటుంది. ఒకప్పుడు 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు మాత్రమే గుండెపోటు అనేది వచ్చేది. కానీ ఇప్పుడు 30 దాటిన వారికి కూడా గుండెపోటు వచ్చేస్తుంది. కొన్ని కేసుల్లో చిన్న పిల్లలకు, విద్యార్థులకు కూడా గుండెపోటు అనేది వస్తుంది. సామాన్యులంటే వ్యాయామాలు చేయరు కానీ వ్యాయామాలు చేసే సెలబ్రిటీలకు కూడా గుండెపోటు రావడం ఆశ్చర్యం వేస్తుంది.
పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి సెలబ్రిటీలు ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తారు. అయినా గానీ గుండెపోటు రావడం అనేది బాధాకరం. వ్యాయామాలు చేసే సెలబ్రిటీలైనా, సామాన్యులైనా 30 నుంచి 50 లోపు వయసున్న వారు ఎక్కువగా గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇండియాలో 50 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 50 శాతం మందికి గుండెపోటు వస్తుందని ఇండియన్ హార్ట్స్ అసోసియేషన్ నివేదికలో వెల్లడించింది. ఇండియాలో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు రోజూ 900 మంది గుండెపోటుతో మరణిస్తున్నట్లు ట్రినిటీ హాస్పిటల్స్ నివేదికలో వెల్లడించింది. రోజూ 900 మంది 30 కంటే తక్కువ వయసున్న వారు చనిపోవడం నిజంగా చాలా పెద్ద సమస్య ఇది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు పదేళ్లు ముందే గుండె జబ్బులు వస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
ఐఐటీ మద్రాస్ వాళ్ళు 750 మంది ఇండియన్స్ మీద ఒక డీఎన్ఏ అనాలిసిస్ చేయగా.. అందులో 40 నుంచి 45 శాతం వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని గుర్తించారు. ఈ జీన్ ని సీహెచ్జేఏ ప్రమోటర్ హ్యాప్లోటైప్ అంటారు. నిద్ర లేకపోవడం, ఒత్తిడి. రాత్రి పది లోపు నిద్రపోయే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాలు తక్కువ. సరిగా నిద్రపోకపోతే రక్తపోటు పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. డిప్రెషన్ పెరిగిపోతుంది. ఇవన్నీ గుండె జబ్బులకు దారి తీస్తాయి. ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి అనేది ఉంటుంది. ఇవాళ 18 నుంచి 25 ఏళ్లు వయసున్న ప్రతీ ఏడుగురిలో ఒకరు ఒత్తిడి, డిప్రెషన్ కి లోనవుతున్నారు. గుండె జబ్బులు రావడానికి నిద్రలేమితనం, ఒత్తిడి, డిప్రెషన్ ఒక కారణమైతే.. మరొక కారణం అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం చేయకపోవడం.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ఒక మనిషి వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. అంటే రోజుకి కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచిస్తుంది. అయితే ఇండియాలో 50 శాతం మంది అసలు వ్యాయామమే చేయరని నివేదికలు చెబుతున్నాయి. దీనికి కారణం సమయం లేకపోవడం అని అనుకుంటారు కానీ కాదు. సమయం కేటాయించలేకపోవడం. సమయం కేటాయిస్తే దేనికైనా సమయం అనేది ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేసే క్రమంలో సమయం అనేది దొరకదు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాక దొరక్క దొరక్క సమయం దొరికిందని సెల్ ఫోన్ తో ఉండడం.. ఆలస్యంగా నిద్రపోవడం.. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం. అదే త్వరగా నిద్రపోతే ఉదయం తెల్లవారుజామున లేస్తే వ్యాయామం చేయవచ్చు. కంటి నిండా నిద్ర కూడా ఉంటుంది.
ఇక ఆహారం విషయానికొస్తే.. ఇప్పుడు మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, న్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వందేళ్ల క్రితం మన పూర్వీకులు నెల రోజులు తినే చక్కెరను ఇప్పుడు ఒక రోజులో తినేస్తున్నారు. ఇక కూరగాయలు రసాయనాలతో పండిస్తున్నారు. వంటకాల్లో ఆయిల్ ఎక్కువగా వేసేస్తున్నారు. ఇక వండుకునే ఓపిక లేనివారు నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పీజ్జా, బర్గర్ అంటూ ఫాస్ట్ ఫుడ్ కడుపు లోపలకి తోసేస్తున్నారు. దీని వల్ల ఫాస్ట్ గా వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇక కూల్ డ్రింకులు కూడా ప్రమాదమే అని అంటున్నారు. చిన్న వయసులోనే గుండె జబ్బులు రావడానికి మరొక కారణం.. మద్యం, సిగరెట్. గుండెపోటుతో చనిపోయిన నలుగురిలో ఖచ్చితంగా ఒక పొగ తాగే వ్యక్తి ఉంటాడని అధ్యయనాలు చెబుతున్నాయి. మద్యం తాగేటప్పుడు గుండె వేగం, రక్తపోటు అనేవి పెరిగిపోతాయి. తరచూ తాగడం వల్ల గుండె వేగం, రక్తపోటు పెరిగి గుండె కండరం బలహీనపడుతుంది. కాబట్టి మద్యం, సిగరెట్లకు దూరం ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఫాస్ట్ ఫుడ్ ని అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయిల్ తక్కువగా తినాలి. సమయానికి సరిగా నిద్రపోవాలి. ఒత్తిడి, డిప్రెషన్ లేకుండా ఉండడం కోసం కాసేపు గేమ్స్ ఆడుకోవడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గడపడమే చేయాలి. చాలా రిలాక్స్డ్ గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పార్క్ కి వెళ్లడం, చల్లని గాలిని పీల్చడం, ప్రకృతిని ఆస్వాదించడం లాంటివి చేయాలి. రాత్రుళ్ళు ఫోన్ ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఇక మంచి ఆహారం, మంచి నిద్రలతో పాటు వ్యాయామం కూడా చేస్తే మంచిది. అతిగా వ్యాయామం చేసినా కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. ఆహారం, నిద్ర, వ్యాయామం, ఆటలు, పాటలు అన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటేనే జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ఏదీ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. మరి ఎక్కువగా చిన్న వయసున్న వారికే గుండెపోటు రావడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. అలానే ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.