పచ్చ కామెర్లు చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది వచ్చిందంటే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఒక్కోసారి నాటు వైద్యం కారణంగా ప్రాణాపాయం తప్పదు..
కొందరికి చిన్నప్పుడే జాండీస్ సోకి చనిపోతుంటారు. పెద్దల్లోనూ ఈ వ్యాధి బారిన పడేవారు ఉంటారు. వీటిని కామెర్లు లేదా పచ్చ కామెర్లుగా పిలుస్తారు. కామెర్లు వస్తే కళ్లు పచ్చగా మారుతాయి. తర్వాత శరీరం మొత్తం పచ్చ కలర్‌లోకి మారిపోతుంది. మూత్రం కూడా ఎల్లో కలర్‌లో వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే పచ్చ కామెర్ల బారిన పడినట్లు భావించాలి. వాస్తవానికి పచ్చ కామెర్లు వ్యాధికాదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధికి సంబంధించిన లక్షణమట.
శరీరంలో జ్వరం, వాంతులు వచ్చినట్లే ఇది కూడా దేహంలో ఎదురైన అపసవ్యతల కారణంగా బయటపడే ఒక లక్షణంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి చికిత్స ప్రత్యేకంగా ఉంటుంది. కారణాలు విశ్లేషించి ఏ రకమైన కామెర్లు, బాడీ తత్వాన్ని బట్టి చికిత్స అందిస్తుంటారు. కామెర్లకు కారణం బిలిరుబిన్ అనే వ్యర్థ పదార్థమని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఎర్రరక్తకణాల నుంచి విడుదలవుతుంది. హెల్దీబాడీలో రక్తంలో కొద్ధి స్థాయి వరకు ఈ బిలిరుబిన్ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
బిలిరుబిన్ స్థాయి పెరిగిన కొద్దీ లివర్ దీన్ని శరీరం నుంచి వదిలేస్తుందట. కామెర్లకు కారణభూతమైన బిలిరుబిన్ స్థాయి పెరగడానికి కొన్ని కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర రక్తకణాలు బిలిరుబిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం, కాలేయం బిలిరుబిన్‌ని త్వరగా శరీరం నుంచి బయటకు విసర్జించలేకపోతాయని చెబుతున్నారు. విసర్జిస్తున్న బిలిరుబిన్ చిన్న పేగుల్లోకి విడుదలయ్యే ప్రక్రియలో ఆటంకాలు కలుగుతాయని, ఈ స్థితినే కామెర్లుగా చెబుతున్నారు వైద్యులు.
ఎలా నివారించాలంటే..
కామెర్ల జబ్బును నివారించేందుకు కొన్ని ప్రత్యేక పద్ధతులున్నాయని వైద్యులు చెబుతున్నారు. హెపటైటిస్ ఏ, బీలకు టీకా మందులున్నాయి. ఆహారం ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ ఏ, ఈ వ్యాధులను ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా నివారించవచ్చని పేర్కొంటున్నారు. పిత్తాశయంలో రాళ్లు, పిత్తాశయ ఇతర వ్యాధుల వల్ల వచ్చే కామెర్లను పిత్తాశయం తొలగించడం ద్వారా నయం చేయాలని స్పష్టం చేస్తున్నారు వైద్యులు. కామెర్లను నిర్లక్ష్యం చేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేస్తున్నారు. అందుకే లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమమని చెబుతున్నారు.