ప్రతీ ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడంటే టీచర్ అని, సార్ అని, మాస్టర్ అని అంటున్నారు గానీ ఒకప్పుడు గురువు గారు అనే సంబోధించేవారు. గురు, శిష్యుల మధ్య ఉండే సంబంధం ఎంత గొప్పగా ఉండేదో తెలిపే శ్లోకమే ఈ ‘ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః’ శ్లోకం. గురువు తన జ్ఞానాన్ని తన శిష్యులకు పంచి వారి భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుతాడు. ప్రపంచానికి పనికొచ్చే ఒక యోధుడిగా తన శిష్యుడిని మలుస్తాడు. విద్య అంటే చదువు(జ్ఞానం) మాత్రమే కాదు.. బతుకు తెరువు చూపించే ప్రతీది విద్య కిందకే వస్తుంది. రామాయణ, మహాభారతం వంటి పురాణాలే కాకుండా విలు విద్యలు, యుద్ధ విద్యలు వంటివి నేర్పే గురువులు కూడా ఉన్నారు.
అప్పట్లో గురువు అంటే దేవుడితో సమానంగా భావించేవారు శిష్యులు. ఇప్పట్లో లాగా గురువుల మీద కుళ్ళి జోకులు వేయడాలు, టీచర్ కొట్టారని పేరెంట్స్ కి కంప్లైంట్లు ఇవ్వడాలు ఉండేవి కావు. గురువుని తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువ అని భావించేవారు. అంతెందుకు సాక్షాత్తు ఆ త్రిమూర్తులే వస్తే తమ గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్పిన శిష్యుడు ఉన్నాడు. అతనెవరో కాదు కౌత్సుడు. కౌత్సుడు చాలా పేద వాడు. అప్పట్లో గురువులే శిష్యులని ఎంచుకునేవారు. అలా ఈ కౌత్సుడిని విద్యాధరుడు అనే గురువు తన ఆశ్రమానికి పిలిచి మరీ అన్ని విద్యలు నేర్పించారు. ఆశ్రమం అంటే ఇప్పటి భాషలో హాస్టల్. ఒకసారి గురువు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్లారు. గురువు వచ్చే వరకూ కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.
గురువు తిరిగొచ్చిన కొన్ని రోజులకి కౌత్సుడి విద్య పూర్తయ్యింది. కౌత్సుడిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు మాత్రం తన గురువును వదిలి ఎక్కడికీ రానని, గురువు దగ్గరే ఉంటానని తెగేసి చెప్పాడు. దీంతో కౌత్సుడి తల్లిదండ్రులు వెనుతిరిగారు. అప్పుడు గురువు.. తనని వదిలి వెళ్లకపోవడానికి కారణం ఏంటి అని కౌత్సుడ్ని అడిగారు. గురువు గారు మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూసాను. “మీరు త్వరలో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడబోతున్నారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు” అని కౌత్సుడు అంటాడు. కౌత్సుడు చెప్పినట్టే కొన్ని రోజులకి గురువుకి కుష్టు రోగం వస్తుంది. ఆరోజుల్లో కుష్టు రోగానికి చికిత్స లేదని, గురు శిష్యులిద్దరూ కాశీకి వెళ్ళి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని కాశీ బయలుదేరారు. గురువు రోగాన్ని చూసి కాశీ ప్రజలు ఇద్దరినీ అసహ్యించుకునేవారు.
గురువుని వదిలేసి వెళ్లిపోమని చాలా మంది చెప్పారు. అయినా గానీ కౌత్సుడు గురువుని వదలకుండా సేవలు చేస్తూనే ఉన్నాడు. కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వచ్చి గురువుని వదిలేయమని సలహా ఇవ్వగా.. అందుకు కౌత్సుడు ఒప్పుకోలేదు. తర్వాత విష్ణు మారువేషంలో వెళ్లి వదిలేయమని అంటే.. కౌత్సుడు వినలేదు. ఆఖరున ఆ శివుడు వెళ్లి వదిలేయమని అన్నా కూడా కౌత్సుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పాడు. కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన శివుడు ఏదైనా సహాయం కావాలా అని అడుగగా.. ఇంకెవరూ తన గురువుని వదిలేయమని సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమని కౌత్సుడు అన్నాడు.
ఇంతటి గురు భక్తిని మెచ్చిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ అసలు రూపంలో ప్రత్యక్షమై కౌత్సుడికి మోక్షం ప్రసాదిస్తామన్నారు. దానికి కౌత్సుడు.. మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, గురువే నాకువిష్ణు, గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా శ్లోకాన్ని చెప్పాడు కౌత్సుడు. అదే “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః” శ్లోకం. శ్లోకం చెప్పి తన గురువుకి మోక్షం ప్రసాదించమని కౌత్సుడు త్రిమూర్తులని వేడుకుంటాడు.
త్రిమూర్తులు గురువుకి మోక్షం ప్రసాదిస్తారు. దీంతో కౌత్సుడు తన బాధ్యత తీరిందని భావించి తల్లిదండ్రుల దగ్గరకి వెళ్ళిపోతాడు. అలా కౌత్సుడు తన గురువును అమితంగా ఆరాధించాడు. ఆ ఆరాధన నుండి వచ్చిందే ఈ గురు బ్రహ్మ శ్లోకం. అదే నేటి తరం శిష్యులైతే మాస్టర్ కి జ్వరం వచ్చి సెలవు పెడితే బాగుణ్ణు అని ప్రార్ధిస్తారు. అదే కౌత్సుడికి, కలియుగ శిష్యులకి ఉన్న తేడా. మీలో ఎవరైనా కౌత్సుడిలాంటి స్వభావం ఉన్న వారు ఉంటే మీ గురువుతో మీకు ఉన్న అనుబంధం గురించి కామెంట్ చేయండి.