దసరా పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతీ చోటా నవరాత్రుల ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతుంటారు. దుర్గామాతను ప్రతిష్ఠించి అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకరణలో పూజిస్తారు. ఆయా ప్రాంతాల సాంప్రదాయాలను బట్టి.. అమ్మవారి అలంకారాలు కూడా ఒక్కో విధంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలలో అమ్మవారు అనగానే అందరూ విజయవాడ కనకదుర్గమ్మనే కొలుస్తుంటారు. అయితే.. శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా అలంకరించి కొలుస్తారు.
అమ్మవారు సింహాసనం మీద త్రిశూలధారియై.. అష్ట భుజాలతో, ధగధగ మెరిసే కనకపు నగలతో దర్శనమిస్తుంది. ఆ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులు కన్నుల పండుగలా భావిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలు తొలగిపోతాయని దశాబ్దాలుగా నమ్ముతూ వస్తున్నారు. స్వర్ణ కవచాలంకృత దేవి అలంకారంలో అమ్మవారిని చూసినా, పూజించినా జీవితంలో ఉన్న దరిద్రాలు తొలగిపోయి.. కొత్త వెలుగు మొదలవుతుందని ప్రతీతి.
ఇదిలా ఉండగా.. నాటి కాలంలో విజయవాడను ‘విజయవాటిక’ అనేవారని ఎంతమందికి తెలుసు. విజయవాటిక నుండి విజయవాడగా పేరు ఎలా మారింది? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని కథనాల ప్రకారం.. అర్జునుడు ఈ ప్రాంతంలో పరమశివుని కోసం తపస్సు చేశాడని, అర్జునుడి తపస్సుకు మెచ్చిన శివుడు.. తన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడని చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని విజయవాటికగా పిలుస్తారని ప్రసిద్ధి. గతంలో విజయవాటికను మాధవ వర్మ అనే రాజు పరిపాలించాడట.
ఆ రాజు పరమేశ్వరీ మాతకు గొప్ప భక్తుడని చెబుతుంటారు. తన పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని.. ఎంతో ధర్మంగా రాజ్యపాలన జరుగుతున్న సమయంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుందట. మాధవ వర్మ కుమారుడు ఓసారి రథంపై రాజ్యపర్యటన చేస్తుండగా.. ఆ రథం కిందపడి ఓ బాలుడు చనిపోయాడట. అది పొరపాటు వలన జరిగినా.. ఓ బాలుడి ప్రాణాలు పోయినందుకు మాధవ వర్మ తన కుమారుడికి మరణ దండన విధించాడట. ఆ రాజు నీతినిజాయితీలను మెచ్చి.. అమ్మవారు ఎంతో సంతోషంగా రాజ్యమంతా కనక వర్షం కురిపించినట్లు ప్రసిద్ధి.
ఆనాటి నుండి అమ్మవారిని కనకదుర్గగా పూజిస్తున్నారు. ఇక విజయదశమి శరన్నవరాత్రుల సమయంలో మొదటి రోజు అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి.. ‘స్వర్ణ కవచాలంకృత దేవి’గా కొలుస్తుంటారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారు దర్శించుకున్న భక్తులకు కొంగు బంగారమై.. సకల దారిద్య్రాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. మరి దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులు శరన్నవరాత్రులను ఎంతో నిష్ఠతో పూజిస్తారు. మరి దసరా పండుగపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.