ప్రపంచవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతీ ఏటా వందల కోట్ల మంది కృష్ణ భక్తులు జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో శ్రీ కృష్ణ భగవానుడి ఆలయాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడు జన్మించిన మధురలో అయితే 5 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయి. మరి ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణాలయం ఎక్కడుందో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణుడి ఆలయం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. దాదాపు ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. నదియా జిల్లా మాయాపూర్‌లో 6 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో శ్రీ మాయాపుర చంద్రోదయ మందిరాన్ని ఇస్కాన్ వారు నిర్మిస్తున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి మొదటి పునాది రాయి 1972లో పడింది. 2009లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో 7 అంతస్తులు ఉన్నాయి. 10 వేల మంది భక్తులు కూర్చొని భజనలు చేసేందుకు వీలుగా ఎకరంన్నర విస్తీర్ణంలో ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక పూజారులు చేసే ప్రత్యేక పూజల కోసం రెండున్నర ఎకరాల్లో విశాలమైన అంతస్తును కేటాయించారు. ఆలయం ముందు భాగంలో 45 ఎకరాల్లో రంగు రంగుల పూల మొక్కలతో ఒక తోటని కూడా ఏర్పాటుచేస్తున్నారు. ఇక ఈ ఆలయ గోపురం ప్రపంచంలోనే అన్ని దేవాలయాల గోపురాల కంటే పెద్దది. దీని వ్యాసం 177 మీటర్లు ఉండగా.. ఆలయం ఎత్తు 350 అడుగులు ఉంది. ఇక సృష్టి రహస్యాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు భక్తుల కోసం ఆలయ గోపురాన్ని డిజైన్ చేస్తున్నారు.
సమస్త విశ్వాన్ని ఎవరు సృష్టించారు? ఎప్పుడు సృష్టించబడింది? ఎందుకు సృష్టించబడింది? అనే వివరాలు ఇందులో ఉంటాయి. అందుకే దీన్ని వైదిక్ ప్లానిటోరియం అని కూడా అంటారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ప్రపంచ నలుమూలల నుండి కృష్ణ భక్తులు వస్తారని ఇస్కాన్ వారు భావిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఇస్కాన్ భావిస్తుంది. మరి ప్రపంచంలోనే అతి పెద్ద కృష్ణ మందిరమైన మాయాపూర్ చంద్రోదయ మందిరంపై మీ అభిప్రాయన్ని కామెంట్ చేయండి.