సాధారణంగా చాలా మంది భక్తులు గుడికి వెళ్లినప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. దర్శనం అనంతరం దేవుడిని తలచుకొని కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకుంటూ ఉంటారు. కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే కొబ్బరికాయను కొట్టి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు చాలా మంది భక్తులు. భగవంతుడిపై నమ్మకాన్ని, మనలోని అహం, కోపం, అసూయ లాంటి లక్షణాలు తొలగిపోవాలని కొబ్బరికాయ కొట్టి దేవుడికి మొక్కుతూ ఉంటాం.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచుపూర్తిగా తొలగిస్తే అందులో మూడు కళ్ల కనిపిస్తాయి. ఇలా శివుడి ప్రతిరూపంగా కొబ్బరికాను భావిస్తారు. కొబ్బరికాయను కొట్టే ముందు దాన్ని పీచు తీసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అగరబత్తీలకు చూపించి కొడుతుంటారు. ఇలా టెంకాయ కొట్టే ముందు దాన్ని కొట్టే రాయి ఆగ్నేయ ముఖంగా ఉండాలని పెద్దలు చెబుతున్నారు. కొందరు టెంకాయను కొట్టిన తర్వాత వాటిని విడదీయకుండా అలాగే ఉంచుతుంటారు. అలా చేయరాదని పెద్దలు చెబుతున్నారు.
కొబ్బరికాయను కొట్టిన తర్వాత వెంటనే వీడదీసి అందులో ఉన్న నీటిని వేరే పాత్రలో పోయాలని సూచిస్తున్నారు. ఆ రెండు చెక్కలను దేవుడి ముందు నైవేద్యంగా పెట్టాలని చెబుతున్నారు. ఇక చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్లిపోయి ఉంటే తమకు అశుభం కలుగుతుందని భయపడుతుంటారు. కుళ్లిపోయినా, లేదా కొబ్బరికాయలో నలుపు రంగు వచ్చినా, కొబ్బరికాయ రెండు ముక్కలు కాకుండా అనేక ముక్కలుగా పగిలినా ఏమవుతుందోనని ఆందోళన చెందుతారు.
కొబ్బరికాయ కుళ్లిపోయి ఉన్నట్లయితే దాన్ని అశుభంగా భావించరాదని పెద్దలు చెబుతున్నారు. ఇందులో వాస్తవం లేదని, ఇది ఒక అపనమ్మకం మాత్రమేనని క్లారిటీ ఇస్తున్నారు. కొబ్బరికాయ కుళ్లిపోయినట్లయితే మళ్లీ స్నానం చేసి వచ్చి ఇంకో కొబ్బరికాయను కొట్టాలని సూచిస్తున్నారు. వాహనాలకు పూజచేసే సమయంలో కొబ్బరికాయను కొట్టినా ఇదే పద్ధతి అనుసరించాలని స్పష్టం చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వచ్చినట్లయితే కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. కొత్తగా వివాహం చేసుకున్న దంపతులకు పువ్వు వస్తే వారికి సంతానం తొందరగా కలుగుతుందని చెబుతారు.