భారతదేశంలో చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాంతాల్లో అంతు చిక్కని రహస్యలు వాటి చుట్టూ అల్లుకున్న కథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బీ శివరామ పట్నంలోని భీముని గుండాల్లోని రాయి చరిత్ర. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం బీ శివరామ పట్నంలోని భీమునిగుండాల ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాయిపై నీరు చల్లితే అర్థంకాని లిపి మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడ దేవతలు తిరిగే వారని, రుషులు ఇక్కడే తపస్సు చేశారని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడని ఇక్కడి వారి నమ్మకం.
కొన్నేళ్ల క్రితం మేకలు కాసేవారు ఒకసారి నీరు తాగేందుకు వచ్చి రాయిపై నీళ్లు చల్లడంతో అక్కడ ఏదో రాసి ఉన్నట్లు కనిపించింది. ఆనాటి నుంచి ఆ ప్రాంతానికి పర్యాటకుల, భక్తుల రాక మొదలైంది. ప్రతి శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఆ రాయిపై నీరు చల్లి అక్షరాలను చూస్తారు. కానీ వాటి అర్థం ఏంటో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. రాయిపై ఉన్న అక్షరాలు సంస్కృతంలో ఉన్నట్లు కొందరు చెప్తున్నారు.
రాయి వెనుక సొరంగ మార్గం ఉందని, దీని వెనుక నిధుల ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. కొంతకాలం నుంచి నిధి, నిక్షేపాల కోసం చాలా మంది రావటం ఫొటోలు తీసుకున్నారు. ఇక్కడే ఉండి రహాస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నించి చాలా డబ్బు వృథా చేసుకున్నారు. కొందరు రాయి పగల కొట్టాడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ రాయి వెనుక నిజంగానే నిధులు ఉన్నాయా? అసలు రాయిపై ఉన్న అక్షరాలు ఏ భాషకు చెందినవి అనే విషయంలో మాత్రం అస్పష్టత కొనసాగుతోంది. మరి అటు వైపు మీరు వెళ్తే ఆ లిపి చూసి రహస్యాన్ని కనిపెట్టగలరేమో ప్రయత్నించండి.