Maha Shivaratri 2023 Fasting Rules & Procedure in Telugu: పురాణాల ప్రకారం హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రికి ఎంతో ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంది. దేవుళ్లల్లో మహాశివుడికి బోళా శంకరుడు అనే పేరు ఉంది. అంటే భక్తితో ఒక్కసారి తలుచుకున్నా కోరిక కోరికలు తీరుస్తాడని చెబుతారు. అలాంటి శివుడికి ఇష్టమైన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినం.
మహాశివరాత్రి.. హిందువులు జరుపుకునే ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన పండగల్లో ఇది కూడా ఒకటి. పురాణాల ప్రకారం మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శివపార్వతులు వివాహం చేసుకున్న రోజుని శివరాత్రిగా జరుపుకుంటాం. ఈరోజునే శివుడు తాండవం చేస్తాడు. సాధారణంగా ప్రతినెలా శివరాత్రి వస్తుంది. దానిని మాస శివరాత్రి అంటారు. అయితే ఏడాదికి ఒకసారి చలికాలం చివర్లో.. వేసవికాలానికి ముందు వచ్చేదే మహాశివరాత్రి. ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 18న జరుపుకుంటున్నారు. అయితే శివరాత్రి అనగానే అందరికీ గుర్తొచ్చే ఉపవాసం. కానీ, చాలామందికి ఉపవాసం ఎలా చేయాలో సరిగ్గా తెలియదు. అలాంటి వారికోసం ఉపవాసం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
దేవుళ్లల్లో కల్లా మహాశివుడికి ఎక్కువ మంది భక్తులు ఉంటారు. అలాగే త్రిమూర్తుల్లో కెల్లా శివుడే అతి శక్తిమంతుడు అని కూడా చెబుతుంటారు. అంతేకాకుండా శివుడు భోళా శంకరుడు. భక్తిగా శివయ్య అని పిలిస్తే కోరిక కోర్కెలు తీరుస్తాడంటూ పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. అయితే శివయ్యను ఆరాధించడం, యన అనుగ్రహం పొందాలంటే మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేస్తే ఎంతో మేలు జరుగుతుందని పండితులు, పురాణాలు చెబుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మహాశివరాత్రికి ఉపవాసం ఉండాలని కూడా చెబుతారు. యితే చాలా మందికి ఉపవాసం ఎలా ఉండాలి అనేది తెలియదు. పైగా ఉపవాసం విషయంలో కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు.
నిజానికి ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా, ఆయన సేవలో ఉండటం అని చెబుతారు. ఆ రోజు మీ ధ్యాస, ఆలోయన అంతా ఆ దేవుడి చుట్టూనే తిరుగుతుండాలి. ఉపవాసం అన్నారని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండటం కూడా సరైన పద్ధతి కాదు. అలా శరీరాన్ని కష్టపెట్టమని ఏ పురాణాలు, దేవుళ్లు చెప్పలేదు. అంతేకాకుండా ఈ ఉపవాసం వల్ల శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వైద్యులు సైతం వారంలో ఒకరోజు ఉపవాసం ఉంటే మంచిదనే చెబుతున్నారు. అలా చూసుకున్నా కూడా మీరు దేవుడి కోసం చేసే ఉపవాసం మరోవైపు మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి ఉపవాస సమయాలు, నియమాలు ఇవే!
ఈ ఉపవాసం చేసేందుకు చాలా మంది షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. బాగా పొద్దుపోయాక నిద్రలేవడం, ముందురోజు సుష్టిగా భోజనం చేయడం, మాంసాహారం తీసుకుంటే అరగడానికి సమయం పడుతుంది కాబట్టి ఉపవాసం సాఫీగా సాగిపోతుందని భావిస్తుంటారు. అయితే పురాణాల ప్రకారం మహాశివరాత్రి ముందురోజు, ఉపవాసం ఉండేరోజు అస్సలు మాంసాహారం తినకూడదు. మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఆ మహాశివుడిని ఆరాధించాలి.
భగవంతునికి సంబంధించిన భజన, కీర్తనలు, స్తోత్రాలు వంటి వాటిని పటిస్తూ, భగవంతునికి దగ్గరగా ఉండి చేసేదే ఉపవాసం. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున ప్రారంభించిన ఉపవాసం మరుసటి రోజు వేకువజామున 4 గంటల సమయంలో ముగిస్తారు. ఈ సమయంలో ద్రవపదార్థాలు, ప్రసాదం, పళ్లు స్వీకరిస్తూ ఉపవాసం, జాగారణ చేస్తారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఔషధాలు సేవించే వారు ఈ ఉపవాసానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. భక్తితో పాటు ఆరోగ్యం మీద దృష్టి సారించాలని సూచిస్తున్నారు.