భారతీయుల సనాతన ధర్మంలో దసరా ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల దసరా రోజున ఉత్సవాలు మిన్నంటుతాయి. ఇక రాముడు రావణుడిపై విజయం సాధించింది ఇదే రోజు కనుక.. ఆ నేపథ్యంలో రావణ దహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దుర్గాదేవిని పూజిస్తూ విజయదశమి జరుపుకుంటారు.
దసరా వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా ఆందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోతారు. ఎంత పేదవారైనా సరే తమ కుటుంబానికి కొత్త బట్టలు కొని.. పిండి వంటలు చేసుకుంటారు. సాయంత్రం దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకొని జమ్మి ఆకు ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే దసరా అని పేరెలా వచ్చిందో తెలుసా.. దశహరా అంటే దశ విధ పాపహరం అని అర్థం. దస్+హరా..అంటే.. హిందీలో దస్ అంటే తెలుగులో పది అని అర్థం వస్తుంది. అంటే.. 10 తలల రావణాసురున్ని రాముడు హతమార్చిన సందర్భం అన్నమాట. మొదట్లో విజయదశమిని,దశహరా అని వ్యవహరించేవారు. రాను రాను అది దసరాగా మారింది. దశకంఠుడు అన్నా రావణాసురుడు అన్నా ఒకటే అర్థం వస్తుంది. అయితే ఇక దశహరా అంటే 10 పాపాలను తొలగించేది అనే అర్థం కూడా వస్తుంది.
మనుషులు శారీరకంగా చేసే పాపాలు 3 ఉంటాయి. అవి అపాత్రదానం, శాస్త్రం అంగీకరించని హింస చేయడం, పరస్త్రీ లేదా పురుషునితో సంగమించడం. ఇక నోటి ద్వారా చేసే పాపాలు 4 ఉంటాయి. అవి పరుషంగా మాట్లాడడం, అసత్యాలు చెప్పడం, వ్యర్థ ప్రలాపాలు చేయడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించడం. పరుల సొమ్మును తస్కరించాలనే బుద్ధి ఉండడం, ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం, అహంకారాన్ని కలిగి ఉండడం. ఈ క్రమంలోనే ఈ మొత్తం 10 పాపాలను తొలగించేదిగా దసరాను భావిస్తారు. ఇక ఈ పాపాలు పోవాలంటే.. దసరా రోజున గంగానది స్నానం చేయడం లేదా దుర్గాదేవిని ఆరాధించడం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.