మాఘ శుద్ధ సప్తమిని రథసప్తమి అనే పేరుతో జరుపుకుంటారు. సూర్యుడి యొక్క పుట్టినరోజుగా, సూర్య జయంతిగా భావిస్తారు. ఈరోజు నుంచి సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కు వైపునకు మల్లుతుందని చెప్పుకుంటారు. 365 రోజుల పాటు అవిశ్రాంతంగా తిరిగే సూర్యుడి రథం యొక్క దిశ మారే రోజున రథసప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రథసప్తమి నాడు సూర్య శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఆ శక్తి మనలో ప్రవేశించాలంటే.. రథసప్తమి రోజున స్నానం చేసే ముందు, సౌరశక్తిని తనలో నింపుకున్న జిల్లేడు ఆకులను, రేగుపండ్లను సేకరించి.. తల మీద పెట్టుకుని స్నానం చేయాలి. సప్తమి కాబట్టి ఏడు జిల్లేడు ఆకులను, ఏడు రేగుపండ్లను.. తల మీద, రెండు భుజాల మీద, గుండెల మీద, వీపు మీద, పొట్ట మీద, నడుము కింద భాగంలో ఇలా ఏడు చోట్ల ఏడు జిల్లేడు ఆకులను, వాటి మీద రేగు పండ్లు పెట్టి తల మీద నుంచి స్నానం చేయాలి.
ఆ తర్వాత తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి.. ఆవు పిడకలతో చేసినటువంటి దాలి మీద ఆవు పాలు పొంగించి.. పరమాన్నం వండాలి. పాలు పొంగుతున్న సమయంలో నెయ్యి రాసిన బియ్యాన్ని పాలలో వేయాలి. ఆ పాలతో బియ్యాన్ని మెత్తగా ఉడికించాలి. ఉడికే సమయంలో సూర్యుడికి షోడోపచార పూజ చేయాలి. పూజ అయిన తర్వాత మెత్తగా ఉడికిన బియ్యంలో బెల్లం, నెయ్యి వేసి మెత్తని పరమాన్నం చేసి సూర్యభగవానుడికి నివేదన చేయాలి. అలానే చిక్కుడు కాయలతో రథాన్ని తయారుచేయాలి. రథం మీద చిక్కుడు ఆకు పెట్టి.. దాని మీద పరమాన్నం నివేదించాలి. సూర్యాధన చేస్తే ఆరోగ్యం, జ్ఞానం, సంపదలు సిద్ధిస్తాయి.
ఆరోగ్యం, సంపద, శక్తి, జ్ఞానం కావాలంటే సూర్యుడ్ని ఆరాధించాలి. హనుమంతుడు సూర్యుడి దగ్గర చదువుకునే అంత పండితుడు అయ్యారని పండితులు చెబుతారు. ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధించాలంటే మాఘ మాసంలో ప్రతి రోజూ లేదా ఆదివారాలు, అది కూడా కుదరని పక్షంలో రథసప్తమి నాడు సూర్యుడ్ని ఆరాధించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే విద్యా సంపద, ఆరోగ్య సంపద, ధన సంపద, వస్తు సంపద అన్ని రకాల సంపదలు లభ్యమవుతాయని చెబుతున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు రథసప్తమి నాడు ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం పూజ ఎలా చేయాలో ఇంకా వివరంగా చెప్పారు. వీడియో చూడగలరు.