హైదరాబాద్ సైదాబాద్ ఎల్‌ఐసీ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో నీటి సరఫరా వివాదం చినిగి చినిగి గాలి వానల మారింది. అయితే విషయం ఏంటంటే..? గత కొంత కాలం నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించే మహిళకు మిగిలిన పది కుటుంబాలకు బోర్‌వాటర్ వినియోగంపై వివాదం నడుస్తోంది. వీరి మధ్య తరుచు గొడవలు చెలరేగుతుండటంతో పోలీసుల వరకూ కూడా వెళ్లి వచ్చారు. అయితే తాజాగా గ్రౌండ్ ఫ్లోర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ బోర్ మోటర్ ను పూర్తిగా అక్కడి నుంచి తొలగిస్తూ నీటి సరఫరాను అడ్డుకుంది.
దీంతో ఆగ్రహానికి గురైన అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ లో ఉంటున్న దంపతులు ఆ మహిళతో గొడవకు దిగారు. దీంతో తరుచు గొడవలు జరుగుతుండటంతో ఆ దంపతులు ఇద్దరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో వెంటనే నిచ్చెన సాయంతో అపార్ట్ మెంట్ పై భాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. ప్రతీ రోజు బోర్ నీటి వ్యవహారంపై గ్రౌండ్ ఫ్లోర్ మహిళ తరుచు గొడవలు సృష్టిస్తోందని భరించలేకే సూసైడ్ చేసుకుంటున్నామంటూ హల్చల్ చేశారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పటంతో కిందకు దిగారు. దీంతో అందరూ అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.