హిజ్రాల వేధింపుల కారణంగా ఓ ఇంటర్ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. తాజాగా విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అయితే ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? హిజ్రాల వేధింపులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడలోని సత్యనారాయణపురం పరిధిలోని ఓ ప్రాంతంలో తంబి దాసు, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు.
వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. చిన్న కుమార్తె అనురాధ (18) నగరంలోని ఇంటర్ చదువుతోంది. అలా చదువుకుంటున్న క్రమంలోనే అనురాధకు ఓ హిజ్రా పరిచయం అయింది. దీంతో అప్పుడప్పుడు ఆమెతో కలిసి మాట్లాడేది. ఇక ఈ పరిచయంతోనే అనురాధ ఆ హిజ్రాను ఓ సాయం అడిగింది. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇంట్లో కుటుంబ సభ్యులను అడగడం ఇష్టం లేని అనురాధ హిజ్రా వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకుంది. ఇక తీసుకున్న డబ్బును కొన్ని రోజుల తర్వాత తీరుస్తానంటూ అనురాధ హిజ్రాకు చెప్పింది.
అలా కొన్నాళ్లు గడిచింది. అనురాధ తీసుకున్న అప్పును మాత్రం తీర్చలేకపోయింది. హిజ్రా అనురాధను అనేక సార్లు అడిగి చూసింది. అనురాధ మాత్రం రేపు, మాపు అంటూ కాలాన్ని వెళ్లదీస్తూ వచ్చింది. ఇక అనురాధ మాటలతో విసిగిపోయిన ఆ హిజ్రా మంగళవారం అనురాధ ఇంటికి కొంత మంది హిజ్రాలతో వెళ్లింది. ఖచ్చితంగా నా డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ అనురాధ ఇంటి వద్ద అల్లరి అల్లరి చేసింది. హిజ్రా ఇంటికొచ్చి గొడవ చేయడంతో అనురాధ తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఆ సమయంలో అనురాధకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక అనురాధ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న అనురాధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం అనురాధ తల్లిదండ్రులు హిజ్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.