దేశంలో ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరిగా మహిళ బయటకు తిరిగే పరిస్థితి లేదని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నిక కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. మృగాల్లో మార్పురావడం లేదు. ఇక వరకట్న వేధింపులకు ఎంతో మంది మహిళలు బలిఅవుతూనే ఉన్నారు. అడిగినంత కట్నం ఇచ్చి అత్తారింటికి పంపిస్తే.. అదనపు కట్నం కోసం వేధిస్తూ కొన్నిసార్లు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెళ్లైన మూడు నెలలకే అదనపు కట్నం కోసం భార్యను అతి కిరాతకంగా చంపిన దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మూడు నెలల క్రితం నేలమంగలకు చెందిన కృష్ణమూర్తికి శృతి అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో శృతి తల్లిదండ్రులు రూ.18 లక్షల కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. చిన్నప్పటి నుంచి శృతిని ఆమె కుటుంబ సభ్యులు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడిగినంత కట్నం ఇచ్చి అల్లుడికి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. పెళ్లైన రెండు నెలల వరకు అత్తారింటికి వస్తూ వెళ్తున్న కృష్ణమూర్తి పై ఎంతో గౌరవం, అభిమానం పెంచుకున్నారు శృతి తల్లిదండ్రులు. కానీ.. మూడు నెలల తర్వాత కృష్ణమూర్తి అసలు రంగు బయట పడింది.
శృతితో రోజూ ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవడం.. కొట్టడం లాంటివి చేస్తూ వచ్చాడు. తనకు అదనపు కట్నం కావాలని శృతిని వేధించడం మొదలు పెట్టాడు. ఇప్పటికే తన తల్లిదండ్రులు కట్నం రూపంలో రూ.18 లక్షలు ఇచ్చారని.. మళ్లీ కట్నం అంటే ఎక్కడ నుంచి తీసుకు వస్తారని.. తాను అడగలేనని భర్తను వేడుకుంది. అదనపు కట్నం కోసం కృష్ణమూర్తి కి తల్లిదండ్రులు సైతం వంత పాడారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కట్నం విషయం గురించి భార్యాభర్తల మద్య గొడవ జరగడంతో కృష్ణ మూర్తి మృగంగా మారిపోయాడు.. శృతిని హత్య చేసి పారిపోయాడు. శృతి కుటుంబ సభ్యులు కృష్ణమూర్తి, అతని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.