సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు రాజు చావుపై బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయింది రాజు అని తమకు నమ్మకం లేదని, ఈ విషయానిన పక్కదొవ పట్టించేందుకే ప్రభుత్వం ఎవరిదో శవం తీసుకొచ్చి పెట్టారని ఆరోపించారు. గురువారం బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు విజయశాంతి సింగరేణి కాలనీకి వెళ్లారు. చిన్నారి కుటుంబసభ్యులను ఓదార్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
ఎంతోముద్దుగా ఉన్న ఆ చిన్నారిని ఆ దుర్మార్గుడు ఇలా చేయడానికి కారణం ఇక్కడ దొరుగుతున్న డ్రగ్స్, గంజాయి అని మండిపడ్డారు. ఇంత విచ్చలవిడిగా మత్తుపదార్థాలు ఇక్కడ దొరకడం వెనుక పోలీసు వాళ్ల హస్తం ఉందని ఆరోపించారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని, తల్లిదండ్రులు తమ పిల్లల వెంట ఉండి స్కూల్‌కు తీసుకెళ్లి, తీసుకురావాలని సూచించారు. ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం ప్రీ ప్లాండ్‌గా ఈ అంశాన్ని పక్కదొవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజంగానే రాజు చనిపోయి ఉంటే అతని శవాన్ని చూపిస్తే అతని ముఖం చూసి అప్పడు ఒప్పుకుంటాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడుతానని వెల్లడించారు.