అల్తాఫ్ కొద్దిరోజుల క్రితం సుహానాకు మెసేజ్‌లు పెట్టాడు. భర్తను వదిలి రమ్మని బెదిరించాడు. దీంతో సుహానా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయింది. వీడియో రికార్డింగ్ పెట్టి మరీ ప్రాణాలు తీసుకుంది.
ఒకరిని ప్రేమించి, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్న వారి జీవితాలు ఛిద్రం అవుతున్నాయి. నూటికి 70 శాతం మంది మాజీల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. మొన్న మంచిర్యాల జిల్లాలో జరిగిన మహేష్ హత్య కూడా ఇలాంటి కోవకు చెందిందే. ఇందారం గ్రామానికి చెందిన మహేష్, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. పెద్దలు యువతికి వేరే పెళ్లి చేశారు. ప్రియురాలు తనకు దూరం అయిందన్న అక‍్కసుతో మహేష్ చేసిన ఓ పని రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఇలాంటి కేసులు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. కర్ణాటకలోని విజయపురలో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
వేరే పెళ్లి చేసుకున్న ప్రియురాలిపై ఓ యువకుడు బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. లైవ్ వీడియోలో తన కష్టాలను చెప్పుకుని ప్రాణాలు విడిచింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, బబులేశ్వర తాలూకా, ఉప్పలదిన్నే గ్రామానికి చెందిన సుహానా, అల్తాఫ్ సులేమాన్ ఓ సంవత్సరం పాటు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం సుహానా ఇంట్లో వాళ్లకి తెలిసింది. దీంతో తల్లిదండ్రులు సుహానాకు వేరే యువకుడితో పెళ్లి చేశారు.
ప్రియురాలు తనకు కాకుండా పోవటంతో అల్తాఫ్ సైకోగా మారిపోయాడు. తరచుగా సుహానాకు ఫోన్, మెసేజ్‌లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ సమయంలో అల్తాఫ్‌కు దస్తగిరిసాబ్, యునీస్‌ల తోడు దొరికింది. అల్తాఫ్, సుహానాను వేధించటానికి ఈ ఇద్దరూ అండగా నిలిచారు. అల్తాఫ్‌ను రెచ్చగొట్టి మరీ సుహానాను ఇబ్బంది పెట్టించేవారు. అల్తాఫ్ వేధింపులు రోజురోజుకు పెరగటంతో సుహానా తట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం అల్తాఫ్ ఆమెకు కొన్ని మెసేజ్‌లు చేశాడు. ‘‘ నువ్వు నీ భర్తను వదిలి రా.. లేదంటే నా దగ్గర ఉన్న నీ ఫొటోలను మీ ఆయనకు పంపిస్తా’’ అని బెదిరించాడు. దీంతో సుహానా మనస్తాపం చెందింది.
చావు ఒక్కటే తన సమస్యకు పరిష్కారం అనుకుంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వీడియో రికార్డింగ్ పెట్టి, లైవ్ సూసైడ్ చేసుకుంది. తన చావుకు అల్తాఫ్, దస్తగిరిసాబ్, యునీస్‌లు కారణమని చెప్పింది. వారిని కఠినంగా శిక్షించాలని కోరింది. కూతురి ఆత్మహత్యపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి వివరాలను సేకరిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.