మంచి ప్రభుత్వం ఉద్యోగం అని చెప్పి.. తల్లిదండ్రులు తమకున్నంతలో ఘనంగా కుమార్తె వివాహం జరిపించారు. వారి పెళ్లై 15 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల కాపురంలో కూడా భర్తకు.. భార్య మీద అనుమానం తగ్గలేదు. కాలు బయట పెడితే చాలు.. ఎవడి దగ్గరకు అంటూ వెకిలి కూతలు. కూర్చున్న, నిల్చున్న ఏం చేసినా తప్పే. పిల్లల ముందు కూడా ఇలానే సూటి పోటి మాటలు. భర్త తీరులో మార్పు వస్తుందని ఏళ్లుగా ఎదురు చూసింది. కానీ తన ఆశ ఎన్నటికి నేరవేరదని అర్థం అయ్యి.. ప్రాణాలు తీసుకుంది. ఈ సందర్భంగా రాసిన సూసైడ్ నోట్ చదివిన ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. ఈ విషాదకర సంఘటన వివరాలు..
తెలంగాణ మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన వనితకు 15 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ఆమె భర్త ఆకుదారి కిష్టయ్యది చెన్నూరు మండలం సుద్దాల గ్రామం. ప్రస్తుతం అతడు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నస్పూర్‌లోని సింగరేణి క్వార్టర్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఇక కిష్టయ్య-వనిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం ఉన్నారు. ఇక పెళ్లైన నాటి నుంచి కిష్టయ్య భార్యను అనుమానించేవాడు. సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాడు.
భార్త తీరులో మార్పు వస్తుందని ఇన్నాళ్లు ఆశగా ఎదురు చూసింది వనిత. కానీ అతడు మారడని అర్థం కావడంతో.. దారుణ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన భర్తకు వనిత శవమై వేలాడుతూ కనిపించింది. దాంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి.. తాను మాత్రం అక్కడ నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వనిత తల్లిదండ్రులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవంగా మారిన బిడ్డను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇక భర్త తనను ఎలా హింసించేవాడో తెలుపుతూ.. వనిత సూసైడ్ నోట్ రాసింది. దానిలో ఆమె నా భర్త కిష్టయ్య పెద్ద సైకో.. పెళ్లైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను ప్రేమగా చూసుకుంది లేదు. ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే చాలు.. అనుమానించేవాడు. అతడి వేధింపులతో మానసిక క్షోభకు గురయ్యాన. అందుకే చనిపోతున్నాను. అమ్మానాన్న.. నా పిల్లలను మీరే జాగ్రత్తగా చూసుకొండి.. నా భర్తకు అప్పగించవద్దు అని కోరింది.