వినాశకాలే.. విపరీతి బుద్ధి అంటారు. పెళ్లై.. ఆర్నెల్ల పిల్లాడు ఉండి కూడా.. మరదలిపై మనసుపడ్డాడు ఓ ప్రబుద్ధుడు. అక్కడితో ఆగక తమకు పెళ్లి చేయాలంటూ పెద్దల దగ్గర పంచాయితీ కూడా పెట్టాడు. బుద్ధి మార్చుకోమని గడ్డి పెట్టడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. మరదలితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో కలకలం రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా రేపల్లె మండలం గౌరీదేవిపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్ కర్నూలు జిల్లా పట్టణ సంధ్యానగర్ కు చెందిన నరేశ్(25)కు అచ్చంపేటకు చెందిన యువతితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు నెలల బిడ్డ కూడా ఉంది. అయితే నరేశ్ నాలుగేళ్ల క్రితం నుంచే వరుసకు మరదలు అయ్యే యువతి(15)తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. అక్కడితో ఆగక.. మరదలితో పెళ్లి చేయాలంటూ పెద్దలను కోరాడు. అందుకు వాళ్లు ససేమిరా అన్నారు. ఈ విషయంపై గతంలోనూ ఇరు కుటుంబాలకు గొడవలు జరిగాయి.
ఇంక కలిసి బతకలేమని వాళ్లు నిర్ణయించుకున్నారు. ‘కలసి బతకలేని మనం.. కలిసి చనిపోదాం’ అంటూ నిర్ణయం తీసుకున్నారు. ఓ రోజు యువతి ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. నరేశ్ కూడా కనిపించలేదు. ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు కాబట్టి కలిసి చనిపోతున్నాం అంటూ బంధువులకు మెసేజ్ పంపారు. ఇద్దరూ కలిసి గౌరీదేవి పల్లి సమీపంలోని జలాశయంలో దూకారు. గజ ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు రోజుల పాటు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మృతదేహాలు దొరక్కపోవడంతో ప్రాజెక్టు ఇంజనీర్ సహాయంతో శనివారం సాయంత్రం మోటార్లతో నీటిని తోడించారు. రాళ్ల మధ్య ఇరుకున్న స్థితిలో వారి మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్రిక్ చేయండి.