ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులు అనే తేడా లేకుండా దాడులు చేయడం... చంపేయడం లాంటివి చేస్తున్నారు. జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపం చేందుతున్నారు.
మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. అని కవి అందెశ్రీ అన్నట్లు సమాజంలో కొంతమంది మనుషులు బంధాలు, బంధుత్వాలు మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు కోసం ఎదుటి వారిని చంపడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా మద్యం, మాదక ద్రవ్యాలకు అలావాటు పడ్డవారు ఎన్ని దారుణాలకైనా సిద్దపడుతున్నారు. ఓ కొడుకు తనను కనీ పెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా చంపి ఆమె పక్కనే మద్యం సేవించిన దారుణ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చెన్నై లోని చక్రమల్లూరు కు చెందిన వాణీశ్వరి, రాహులన్ దంపతులకు రాజేష్, దినేష్ కుమారులతో పాటు ప్రియ అనే కుమార్తె ఉంది. కొంతకాలం క్రితం వాణీశ్వరి భర్తనుకోల్పోయింది. వాణీశ్వరి ఇద్దరు కుమారులు వేలూరు లో పోలీసు ఉద్యోగాలు విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వాణీశ్వరి రెండో కుమారుడు దినేష్ విపరీతంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడు. పోలీస్ అయి ఉండి కూడా విధులు సక్రమంగా నిర్వహించకోపోవడంతో డిపార్ట్ మెంట్ వారు పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయినా కూడా దినేష్ తన తీరు మార్చుకోలేదు. మద్యం సేవించి విధులకు హాజరు అయ్యేవాడే.. ఈ కారణంతోనే ఇటీవల డిస్మిస్ అయ్యాడు. దీంతో దినేష్ భార్య తన ఇద్దరు పిల్లలతో తల్లిగారింటికి వెళ్లిపోయింది.
ఉద్యోగం పోయిన తర్వాత దినేష్ తన తల్లిపై ఆధారపడి జీవిస్తున్నాడు. దినేష్ తన తల్లితో కలిసి చక్రనల్లూరులో ఉంటున్నారు. మద్యానికి భానిస అయిన దినేష్ ప్రతిరోజూ తనకు డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు. ఈ నెల 13న డబ్బులు ఇవ్వమని తల్లిని అడిగాడు.. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో గొడవపడి దగ్గరే ఉన్న కర్రతో వాణీశ్వరి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ఇంటికి తాళం వేసి తల్లి మృతదేహం పక్కగదిలో మద్యం సేవిస్తూ ఉన్నాడు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో వాణీశ్వరి పడి ఉంది. పక్క గదిలో దినేష్ మద్యం సేవిస్తూ ఉన్నాడు. పోలీసులను చూసి అక్కడ నుంచి పారిపోయాడు. వాణీశ్వరి కూతురు ప్రియ ఫిర్యాదు మేరకు దినేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కన్నతల్లి అనే కనికరం లేకుండా కృరంగా చంపిన దినేష్ ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.