సాధారణంగా హిజ్రాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్, జంక్షన్ల వద్ద బిక్షాటన చేస్తుంటారు. కొంతమంది మార్కెట్, దుకాణాలకు వెళ్లి డబ్బులు అడుగుతుంటారు. పుట్టుకతో హిజ్రాలుగా కొంతమంది ఉంటే.. లింగమార్పిడి ద్వారా హిజ్రాలుగా మారిన వారు చాలా మంది ఉంటారు.
కొంతమంది హిజ్రాలను చూడగానే హేళనగా మాట్లాడటం.. వెక్కిరించడం లాంటివి చేస్తుంటారు. సమాజంలో వారిపై చిన్నచూపు కారణంగా ఎవరూ దగ్గరికి రానివ్వరు. దీంతో చదువు, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతుంటారు. హిజ్రాలుగా మారిన వారు సమాజంలో బిక్షాటన జీవనోపాధిగా చేసుకొని బతుకుతుంటారు. కొంతమంది పుట్టుకతోనే హిజ్రాగా పుడుతుంటారు.. మరికొంతమంది శరీరం, ఆలోచనావిధానాల్లో మార్పులు సంభవించడంతో హిజ్రాలుగా మారుతుంటారు. మరికొంతమంది జీవనోపాధికోసం లింగమార్పిడి చేయించుకొని హిజ్రాలుగా మారుతుంటారు. కొంతమంది హిజ్రాలు గా మారిన తర్వాత కుటుంబ పెద్దలు వారిని ఇంటినుంచి వెలేస్తుంటారు. దీంతో చాలా మంది హిజ్రాలు కుటుంబానికి దూరంగా బతుకుతుంటారు. కొంతమంది తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టామని మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఓ యువకుడు హిజ్రాగా మారి తన కుటుంబాన్ని మర్చిపోలేక మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పపడ్డ ఘటన అందరిచే కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళితే..
కర్నూల్ పట్టణంలో సాయిపల్లవి అలియాస్ సాయికుమార్ రెడ్డి (21) అనే హిజ్రా కొంతకాలంగా త్రివర్ణ కాలనీలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన సాయినాథ్ రెడ్డి అలియాస్ సాయి పల్లవి అనే హిజ్రా డోన్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ జీవిస్తున్నారు. కొంతకాలంగా సాయినాథ్ రెడ్డికి శరీరంలో, ఆలోచనా విధానంలో మార్పులు రావడంతో నాలుగేళ్ల క్రితం లింగమార్పిడి చేసుకొని సాయి పల్లవిగా పేరు మార్చుకొని డోన్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అప్పుడప్పుడు కర్నూల్ పట్టణంలో కూడా సంచరించేవారు.
కొంతకాలంగా సాయినాథ్ రెడ్డి అలియాస్ సాయిపల్లవికి కుటుంబ సభ్యులు, బంధువులు గుర్తుకు రావడం తో వారిని కలవాలని అనుకునేవాడు. కానీ.. తాను లింగమార్పిడి చేసుకొని హిజ్రాగా మారిన విషయం తెలిసిస్తే అవమానంగా భావిస్తారని.. తనను వెలివేస్తారని మనస్థాపానికి గురయ్యాడు. ఇలా కొద్దిరోజులుగా మనోవేదనతో కుమిలిపోతూ తన కుటుంబ సభ్యులకు దూరమైన బతుకు ఎందుకు అనుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తోటి హిజ్రాలు ఇది గమనించి వెంటనే హాస్పిటల్ కి తరలించారు.. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయినాథ్ అలియాస్ సాయిపల్లవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.