ప్రస్తుతం సమాజంలో భార్యభర్తల బంధానికి తూట్లు పొడుస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. దాంపత్య జీవితాన్ని హేళన చేసిన వ్యక్తులు కూడా చాలా మందే ఉన్నారు. సుఖం కోసం సంసారాన్ని నాశనం చేసుకున్న గొప్పవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ జంట కథ చెంపపెట్టు లాంటిది. అసలు దాంపత్య జీవితం.. ఒకరి కోసం ఒకరు అనే మాటలకు వీరి కథ అద్దం పడుతుంది. ‘నీ చితిలో తోడై నేనుంటానమ్మ’ అంటూ మగధీర సినిమా పాటలో ఉన్న లైన్ ను నిజ జీవితంలో చేసి చూపించాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య దూరమైతే తట్టుకోలేని భర్త ఆమె కోసం తనువు చాలించాడు.
ఈ విషాద ఘటన బెంగళూరు రూరల్ జిల్లా దేవహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో జరిగింది. విజయేంద్ర(38), లావణ్య(34)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంటి ముందే ఓ చిల్లర కొట్టు నడపుకుంటూ జీవనం సాగించేవారు. వారికి పిల్లలు లేరు.. కానీ, ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలు లేరే అనే బాధ ఉన్నా కూడా.. ఒకరి కోసం ఒకరు ఉన్నాం కదా అంటూ ఆనందంగా జీవించేవారు.
కొంతకాలంగా లావణ్య అనారోగ్యంతో బాధపడుతోంది. విజయేంద్ర ఎన్నో ఆస్పత్రులకు తిప్పాడు. తన స్థోమతకు మించి ఖర్చు పెట్టాడు. భార్యను దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఆమె ఆరోగ్యం క్షిణించి తుదిశ్వాస విడిచింది. బుధవారం లావణ్య అంత్యక్రియలు నిర్వహించారు. బాధాతప్త హృదయంతో ఇంటికి వచ్చిన విజయేంద్ర షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాతి రోజు విజయేంద్ర ఎంతకీ బయటకు రావడం లేదు. స్థానికులు తలుపులు పగలగొట్టి చూశారు. ఇంట్లో ఉరికి వేలాడుతూ విజయేంద్ర మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యను వదిలి ఉండలేను అనుకున్నాడో? ఇంక ఈ లోకంలో నాకు ఎవరున్నారు అనుకున్నాడో? విజయేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.