హైదరాబాద్ : అన్నం పెడుతున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ.. కేర్ టేకర్‌గా ఓ వృద్ధురాలిని కాపాడిల్సింది పోయి డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టింది. సదరు వృద్ధురాలి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాచారం స్నేహపురికాలనీలోని శ్రీనిధి అపార్టుమెంట్‌లో హేమవతి అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. కుమారుడు లండన్‌లో ఉండటంతో తల్లిని చూసుకోవటానికి నెలకు 15 వేల రూపాయల జీతంతో ఓ కేర్ టేకర్‌ను నియమించాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన పెరిక భార్గవి(32) హేమావతికి కేర్‌టేకర్‌గా ఉంటోంది. ఏడేళ్ల కూతురుతో కలిసి భార్గవి అదే ఇంట్లో ఉంటోంది.
అల్మారాలో డబ్బు, బంగారు నగలు ఉండటం చూసిన భార్గవి వాటిపై కన్నేసింది. వాటిని ఎలాగైనా దొంగిలించాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం ఓ ప్లాన్ వేసింది. కొద్దిరోజుల క్రితం హేమావతి కంట్లో నీరు కారుతుండటంతో ఐడ్రాప్స్ వేయమని అడిగింది. అయితే, భార్గవి ఐడ్రాప్స్ బదులుగా హార్పిక్ ద్రావణంలో జండూబామ్, నీరు కలిపి కళ్లలో చుక్కలు వేసింది. ప్రతిరోజూ ఇలానే చేయటంతో హేమావతి కళ్లు కనిపించకుండా పోయాయి. భార్గవి తనపై అనుమానం రాకుండా ఉండటానికి.. హేమావతి కళ్లలో ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆమె కుమారుడికి సమాచారం ఇచ్చింది. అతడు తల్లిని ఆసుపత్రిలో చూపించమని చెప్పాడు. దీంతో భార్గవి, హేమావతిని ఆసుపత్రిలో చూపించింది.
ఈ నేపథ్యంలోనే అల్మారాలో ఉన్న 40 వేల నగదు, ఆరున్నర తులాల బంగారం చోరీ చేసింది. డబ్బులు ఖర్చుచేసి నగల్ని తనతోనే ఉంచుకుంది. రోజులు గడుస్తున్నాయి. హేమావతి కంటి చూపు మెరుగుపడలేదు. దీంతో హేమావతి కుమార్తె ఉషశ్రీ తల్లి ఇంటికి వచ్చింది. హేమావతిని పలు అసుపత్రులకు తీసుకెళ్లింది. అక్కడా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. హేమావతి కళ్లను పరీక్ష చేసిన డాక్టర్లు విషప్రయోగం జరగినట్లు తేల్చారు. హేమావతి కుమారుడు, కుమార్తెకు భార్గవి అనుమానం వచ్చింది. అల్మారాను తెరిచి చూడగా డబ్బు,నగలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్గవి ఇంటికి వెళ్లి వెతికిన పోలీసులకు నగలు కంటపడ్డాయి. దీంతో భార్గవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.