నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. దీని ద్వారా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం చాలా మందికి తెలుసు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లను దాదాపు అందరూ ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్ అయితే గ్రామాల్లో పనులు చేసుకునే వారు సైతం ఉపయోగిస్తున్నారు. దీనిని సరైన విధంగా ఉపయోగిస్తే మంచిగా ఉంటుంది. అదే దారితప్పితే మాత్రం నష్టం జరుగుతుంది. అలా ఫేస్ బుక్ పరిచయం ఓ మహిళలను బలితీసుకుంది. భర్తను వదిలేసి..తన పిల్లలతో హాయిగా గడుపుతున్న ఆ మహిళకు ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం కావడం.. ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన దూదేకుల బాషా..కూతురు హసినా(25)కు చిన్న వయస్సులో వైఎస్సార్ జిల్లా జంగాలపల్లెలకు చెందిన బాబయ్య అనే వ్యక్తి ఇచ్చి వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మానసిక స్థితి సరిగ్గాలేని బాబయ్య హసినాను చిటికిమాటికి కొడుతుండేవాడు. అంతేకాక పిల్లలను, కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకునే వాడు కాదు. అయిన కొన్నాళ్లపాటు సర్ధుకుపోయింది. అయినా భర్త తీరులో మార్పురాకపోవడంతో అతడి వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే పొలం పనులకు వెళ్తూ..పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తుంది. అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో ఫేస్ బుక్ చూస్తూ కాలక్షేపం చేసేది.
ఈక్రమంలో ఐదు నెలల క్రితం బాపట్ల జిల్లా నర్సాయపాలెం గ్రామానికి చెందిన 55 ఏళ్ల భూషణ్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. అతడికి అప్పటికే పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు. భార్యను వదిలేసి భూషణ ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో హసీనాతో ఫేస్ బుక్ లో భూషణం పరిచయం ఏర్పచుకున్నాడు. ఆమెకు తియ్యని ప్రేమపాఠాలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. భర్త నుంచి ఎడబాటు, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న హసీనాకు భూషణం మాటలు హాయిగా అనిపించాయి. దీంతో అతడి దగ్గరు కావడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు. ఈక్రమంలో ఇద్దరు ఫోన్ల ద్వారా కూడా మాట్లాడుకున్నారు. ఇటీవల భూషణ..హసీనాను తన వద్దకు వచ్చేయాలని పిలిచాడు. దీంతో నవంబర్ 1న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఏడేళ్ల కుమారుడితో వెళ్లిపోయింది.
ఘటనపై హసీనా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఫోన్ నెంబర్ ఆధారంగా గాలించిన పోలీసులు నర్సయాపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి వారిద్దర్ని దొర్నిపాడుకు తీసుకొచ్చారు. నవంబర్ 3వ తేదీన హసీనాను ఆమె తండ్రికి అప్పగించి ..భూషణ్ని అక్కడి నుంచి పంపిచేశారు. ఈ క్రమంలో ఏమైందో ఏమో కానీ తన మేనమామ ఇంట్లో హసీనా ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు మరణాన్ని భూషణే కారణమని, అతడి కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి వదిలేయడం, తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో హసీనా పిల్లలు అనాథలయ్యారు. ఇలా ఫేస్ బుక్ పరియం.. ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది.