చాలా మంది ఉన్న ఊరిలో బతికేందుకు సరైన అవకాశం లేక పట్టణాలకు, నగరాలకు వలస వెళ్తుంటారు. మరికొందరు ఎక్కువ డబ్బు వస్తే కుటుంబంతో సంతోషంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఇలానే చాలా మంది ఏజెంట్ల మాటలు నమ్మి ఉన్న ఊరు, కన్నబిడ్డలను వదలి డబ్బుల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే ఇలా వెళ్లిన చాలా మంది అక్కడ నరక యాతన అనుభవిస్తున్నారు. తమ బాధను చెప్పిన వినేందుకు తన.. అనే వారు ఎవరూ అక్కడ కనిపించారు. తిరిగి స్వదేశానికి రావాలనిపించిన వచ్చే పరిస్థితులు అక్కడ ఉండవు. అక్కడ వారు పెట్టి హింసలను భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం కు వెళ్లిన ఓ నిరుపేద మహిళ అక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక.. ఇంటికి వచ్చే అవకాశం లేక ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి(35) ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లింది. అక్కడ ఒక షేక్ ఇంట్లో పనికి కుదిరింది. కొంతకాలం వరకు వెంకటలక్ష్మికి అక్కడ బాగానే ఉంది. లక్ష్మి పని చేసే ఇంట్లో మనుషుల సంఖ్య బాగా పెరిగిపోయారని, దీంతో తాను పనిచేయలేకపోతున్నాని, ఆరోగ్యం సహకరించడం లేదని భర్త నాగరాజుకు వీడియో కాల్ లో తెలిపింది. రోజు రోజుకు పని భారం ఎక్కువ కావడంతో తనను ఇంటికి తీసుకెళ్లాలని భర్త నాగరాజుకు తెలిపింది. తన భార్యను గల్ఫ్ దేశం పంపించిన ఏజెంట్లు జిలానీ, రవిలను కలిసిన నాగరాజు విషయం చెప్పాడు. అంతేకాక తన భార్యను స్వదేశం తీసుకురావాలని వారిని ప్రాధేయపడ్డాడు. అయితే వెంకటలక్ష్మిని భారత్ కు రప్పించాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని ఏజెంట్లు నాగరాజుకు తెలిపారు.
నిరుపేదలమైన తాము అంతమొత్తంలో డబ్బులు ఇచ్చుకోలేమని, కొంత డబ్బులు సర్ధుతామని ఏజెంట్లకు విన్నవించుకున్నారు. అయితే తమ మాటలను ఏజెంట్లు పట్టించుకోలేనది వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో దిక్కుతోచని వెంకటలక్ష్మి భర్తకు మరోసారి వీడియా కాల్ చేసింది. వీడియో కాల్ మాట్లాడుతూనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటలక్ష్మి చావుకు ఏజెంట్లు జిలానీ, రవి కారణమని మృతురాలు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వెంకటలక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామంకి తీసుకురావడంతో.. అక్కడ విషాధ ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు.