Warangal: దసరా పండుగ పూట పెను విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీలో ఉన్న ఐదుగురిపై పిడుగుపడ్డ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని వర్ధన్న పేట మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లా వర్దన్న పేట మండలం బండవతపురం గ్రామానికి చెందిన శివ, సాంబరాజు, సాయిక్రిష్ణలతో పాటు మరో ఇద్దరు మంచి స్నేహితులు. ఈ ఐదుగురు దసరా పండుగ సందర్భంగా దావత్ చేసుకోవాలనుకున్నారు. మందు పార్టీ కోసం బఫర్గడ్ మండలం సాగరం శివారులోని గుట్టవద్దకు వెళ్లారు. ఎంతో సంతోషంగా మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి వర్షం పడింది. దీంతో తడిసిపోతామని భావించిన ఐదుగురు పక్కనే ఉన్న మర్రిచెట్టు కిందకు చేరుకున్నారు.
మర్రి చెట్టు కింద వర్షం పడలేదు. తడవకుండా ఉన్నాం కదా అనుకున్నారు. అదే వారి పాలిట శాపంగా మారింది. కొద్దిసేపటి తర్వాత పెద్ద శబ్ధంతో ఓ పిడుగు మర్రి చెట్టుపై పడింది. పిడుగు పడ్డం కారణంగా శివ, సాంబరాజు, సాయిక్రిష్ణలు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఇద్దరి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వీరిని గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స కోసం గాయపడ్డ వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక, శివ, సాంబరాజు, సాయిక్రిష్ణల మృతితో వారి కుటుంబాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. పండుగ రోజే ఇలా జరగటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Durga Matha Immersion: వీడియో: దుర్గామాత నిమజ్జనంలో పెను విషాదం.. 13 మంది మృత్యువాత!