నెల్లూరులో ఓ వింత దొంగతనం చోటుచేసుకుంది. బ్యాంకు దోచేయడానికో లేదా ఏటీఎం కొల్లగొట్టడానికో అన్నట్లు వమాస్కులు వేసుకుని వచ్చిన దొంగలు కుక్క పిల్లలు, పిల్లులను ఎత్తుకెళ్లారు.
‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా..‘ అన్నట్లు దొంగలందు ఈ దొంగలు వేరు. ఇప్పటివరకు ఇళ్లలోకి చొరబడి నగలు, నగదు దోచుకెళ్లిన ఎందరో దొంగలను చూశాం. కానీ ఈ దొంగలు.. వీరు చేసిన దొంగతనం చాలా విచిత్రమైంది. బ్యాంక్ కొల్లగొట్టడానికో.. ఏటీఎం దోచేయడానికో.. అన్న రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చి కుక్క పిల్లలను ఎత్తుకెళ్లారు. అలా అని మామలు కుక్క పిల్లలేమో అనుకోకండి. చాలా ఖరీదైనవి. ఈ చిత్రవిచిత్రమైన ఘటన రాష్ట్రంలో మొదటది అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఘటన నెల్లూరు నగరంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
నెల్లూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి.. వీఆర్‌సీ సెంటర్ వద్ద ఓ పెట్స్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇందులో దేశవిదేశాల నుంచి తీసుకొచ్చిన ఎన్నో రకాల పక్షులు, పెంపుడు కుక్కలు, పిల్లులు విక్రయిస్తుంటారు. రకరకాల బ్రీడ్ పెట్స్ ఇక్కడ విక్రయిస్తుండటంతో ఈ షాప్ పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో వీటిని ఎత్తుకెళ్లాలని కొందరు దుండగలు ప్లాన్ చేశారు. ముఖానికి మాస్కులు ధరించి చడీచప్పుడూ లేకుండా అర్ధరాత్రి 12 గంటల సమయంలో బిల్డింగ్ లోపలికి వచ్చి కుక్కలు, పిల్లులు ఎత్తుకెళ్లారు. ఎంత సైలెంట్‌గా వచ్చారో, అంతే సైలెంట్‌గా పని కానిచ్చేసి పరారయ్యారు. ఆ దృశ్యాలన్నీ లోపనున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఉదయాన్నే షాపు తెరవడానికి వచ్చిన యజమానులు లోపల పెట్స్, పిల్లులు లేకపోవడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆపై సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దొంగతనం జరిగిందని వెల్లడైంది. పిర్యాదు అందుకున్న పోలీసులు, సీసీటీవీ విజువల్స్ సహాయంతో దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. ఈ దొంగలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.