వ్యాపారవేత్త కూతురుని ఓ మధ్య తరగతి యువకుడు ప్రేమిస్తాడు. ఆ యువతి కూడా ఇతడిని ప్రేమించింది. వీరి ప్రేమ విషయం చివరికి యువతి తల్లిదండ్రులకు తెలియడంతో.. యువకుడు కులం తక్కువ వాడని కూతురు ప్రియుడిని యువతి తల్లిదండ్రులు అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపేస్తారు. అచ్చం లవ్ స్టోరీ సినిమాను తలపిస్తున్న ఈ సీన్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో సూర్యాపేటలో వెలుగు చూసింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యాపేట పట్టణానికి చెందిన నిఖిల్ అనే యువకుడు హైదరాబాద్ లో ఉంటూ ఎల్ఎల్ బీ పూర్తి చేశాడు. అయితే దసరా పండగా కావడంతో ఇటీవల ఇంటికి వెళ్లాడు. ఇదిలా ఉంటే నిఖిల్ సూర్యాపేటకు చెందిన ఓ వ్యాపారవేత్త కూతురిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అయితే వీరి ప్రేమ వ్యవహారం బయటపడి చివరికి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు యువతి తల్లిదండ్రులకు, యువకుడి తల్లిదండ్రులకు నచ్చచెప్పి పంపించారు. అయితే కొన్నాళ్ల తర్వాత నిఖిల్ మళ్లీ ఆ యువతితో మళ్లీ సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నెల 9న నిఖిల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందంటూ ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన కుమారుడు ఇంటికి రాకపోవంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. అతనికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ఇలా కుటుంబ సభ్యులు నిఖిల్ కోసం వెతుకున్న క్రమంలోనే స్థానికంగా ఉన్న ఓ కాలువలో నిఖిల్ శవం బయటపడింది. గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిఖిల్ మృతదేహాన్ని పరిశీలించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ విషయం తెలుసుకున్న నిఖిల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడు నిఖిల్ స్థానికంగా ఉండే ఓ వ్యాపారి కూతురిని ప్రేమించాడని, కులాలు వేరు కావడంతో నిఖిల్ ను ఆ యువతి తల్లిదండ్రులు అనేక సార్లు బెదిరించారు. ఈ క్రమంలోనే మా కుమారుడిని ఆ యువతి తండ్రే హత్య చేశాడంటూ నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్నఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.