భార్యాభర్తలు సంసార జీవితంలో ఎంతో ఆనందంగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకుని చక్కగా జీవితాంతం తోడుగా ఉంటే వాళ్ల బంధం ఎంతో మధురంగా ఉంటుంది. అలానే ఎక్కువ కాలం నిలుస్తుంది. అయితే నేటికాలంలో భార్యాభర్తల బంధాలు బీటలు వారుతున్నాయి. దంపతులు ఒకరిపై మరొకరు పగలు పెంచుకుంటున్నారు. చివరికి అవి కాస్తా హత్యలకు దారితీసుకున్నాయి. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ఇతరులు కూడా బలవుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్యను చంపేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి అతని అత్త ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలోని సాయిఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యతో కలిసి జీవిస్తోన్నాడు. అయితే అతడు మద్యానికి బానిసగా మారి.. భార్యను వేధించేవాడు. నిత్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. కొన్నాళ్లుగా అతడి వేధింపులను భరిస్తూనే.. అప్పుడప్పుడు ఎదిరించేది. అలా సర్ధకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుండేది. అయినా రోజు రోజుకు అతడి ఆగడాలు శృతిమించిపోయాయి. రాత్రి వేళల్లో తాగి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. అలా ఆదివారం రాత్రి కూడా మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో విసుగు చెందిన అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కోపం పట్టలేని ఆ వ్యక్తి భార్యను చంపాలని అత్తారింటికి వెళ్లాడు. భార్యను తీసుకెళ్లడానికి వచ్చినట్లు అక్కడి వారిని నమ్మించాడు.
ఈ క్రమంలో భార్యను చంపే ఉద్దేశంతో ఇనుముతో తయారు చేసిన ఆ ఇంటి ప్రధాన గేటుకు విద్యుత్ తీగతో కరెంట్ సప్లయ్ అయ్యేలా చేశాడు. ఆ సమయంలో అతడి భార్య బయటకి వెళ్లింది. అయితే అదే సమయంలో అతడి భార్య కు బదులు అత్త వచ్చి..తెలియక ఆ గేటును తాకింది. దీంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉల్కిపడ్డారు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.