నవ మాసాలు కడుపున మోసిన తల్లి కొడుకు ప్రయోజకుడిగా మారతాడని ఎన్నో కలలు కనింది. కనిపెంచిన ఆ తల్లిదండ్రులు ఉన్నదాంట్లో కుమారుడిని చదివించారు. అలా ఎన్నో ఆశలతో పెంచిన ఆ తల్లిదండ్రులే తమ చేతులతో చివరికి కొడుకు ప్రాణాన్ని తీశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కన్న కొడుకుని తల్లిదండ్రులు ఎందుకు హత్య చేశారు. అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఆదర్శనగర్.
ఇదే ప్రాంతంలో యాదగిరి, వెంటకటమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు కిరణ్ (23) జన్మించాడు. అయితే ఈ దంపతులు ఉన్నదాంట్లో జీవితాన్ని నెట్టుకొస్తూ కుమారుడిని చదవించారు. కానీ కొడుకు చదువుకోకుండా చెడు తిరుగుల్లు తిరిగేవాడు. అలా కొన్నాళ్ల తర్వాత డీజే సౌండ్స్ బాక్సులు అద్దెకు ఇస్తూ సంసారాన్ని నెట్టుకొచ్చాడు. పెళ్లి చేస్తేనైనా కుమారుడు మారుతాడేమోనని కిరణ్ తల్లిదండ్రులు అతడికి సౌమ్య అనే యువతితో పెళ్లి జరిపించారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. వీరి సంసారం సాఫీగా సాగుతున్న క్రమంలోనే భర్త కిరణ్ గంజాయికి బానిసై భార్యను వేధిస్తుండడంతో భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది.
అప్పటికి బుద్దిమార్చుకోని కిరణ్ రోజూ గంజాయి తాగుతూ ఇంట్లో తల్లిదండ్రులను వేధించాడు. అయితే కుమారుడి హింసను భరించలేని కిరణ్ తల్లిదండ్రులు ఇటీవల హైదరాబాద్ వెళ్లిపోయారు. కాగా ఇటీవల వీరి బంధువుల్లో ఒకరు చనిపోతే కిరణ్ తల్లిదండ్రులు తిరుమలగిరికి వచ్చారు. ఇక తల్లిదండ్రుల రాకను గమనించిన కిరణ్ అదే రోజు రాత్రి గంజాయి సేవించి డబ్బులు ఇవ్వకుంటే చంపుతానంటూ తల్లిదండ్రులను బెదిరించాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న దుస్తువులను తగలబెట్టాడు.
అనంతరం మరోసారి తల్లిదండ్రులపై కిరణ్ దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇక తట్టుకోలేకపోయిన కిరణ్ తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా వినని కిరణ్ తండ్రిని కొట్టబోయాడు. ఇక ఓపిక నశించిన ఆ దంపతులు కొడుకు కిరణ్ ను గొంతుకు తాడి బిగించి హత్య చేశారు. కొడుకు చనిపోయాడని తెలుసుకున్నాక ఆ తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.