ఈ మద్య దొంగలు బాగా తెలివి మీరారు. ఇటీవల బీహార్‌లో దొంగలు పట్టపగలు బ్రిడ్జిలను ఎత్తుకెళ్లిన వార్తలు విని విస్తుపోయాం.. ఇప్పుడు ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసిన 600 వందల సెల్ టవర్లు మాయం చేశారు కేటుగాళ్ళు. వివరాల్లోకి వెళితే..
జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి సంబంధించిన మెయిన్ ఆఫీస్ ఒకటి ముంబైలో ఉంది. దాని ప్రాంతీయ కార్యాలయం చెన్నైలోని పురసవాక్కంలో ఉంది. జీటీఎల్ సంబంధించిన మొబైల్ టవర్స్ భారతదేశం మొత్తం మీద 26 వేల వరకు ఏర్పాటు చేశారు. ఇందులో తమిళనాడులో 6 వేల వరకు మొబైల్ ఫోన్ టవర్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాట ఆరు వందల టవర్స్ మాయం అయ్యాయి. మొబైల్ ఫోన్ టవర్స్ కోసం సుమారు గా రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది.. ఈ లేక్కన కోట్లలోనే నష్టం వాటిల్లిందని అంటున్నారు యాజమాన్యం.
ఇటీవల కంపెనీ వారు పనిచేయని మొబైల్ ఫోన్ టవర్ల స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు ఎంక్వెయిరీ చేయగా ఈ మొత్తం తతంగం బయటపడింది. మొదట ఈరోడ్ జిల్లాలో ఒక టవర్ కనిపించకపోవడం గుర్తించారు.. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టారు. ఇలా వారి ఎంక్వెయిరీలో దాదాపు ఆరువందల టవర్లు కనిపించకుండా మాయమైనట్లు గుర్తించారు.
ఇదంతా లాక్ డౌన్ సమయంలో జరిగి ఉండవొచ్చని కంపెనీ యాజమాన్యం అనుకుంటున్నారు. అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాలన్నింటినీ పరిశీలించారు. ఇదంతా ఒకే ముఠా సభ్యులు చేసి ఉండవొచ్చని భావిస్తున్నారు. వందల సంఖ్యల్లో సెల్ టవర్ లు మాయం కావడం సంచలనంగా మారింది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.