నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సాగర్ రహదారిపై దాదాపు 7 గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఇంత దారుణానికి వడికట్టిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి హత్యాచార నింధితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి సీసీ టీవీ దృశ్యాలు లభించినట్లు సమాచారం. అయితే నింధితుడు రాజు కోసం 100 మంది పోలీసులు రంగంలోకి దిగి తీవ్రంగా గాలిస్తున్నారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
తాజాగా ఘటన జరిగిన రోజు సాయంత్రం ఎల్బీనగర్ వద్ద మరో స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు ఎల్బీనగర్ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ నేపథ్యంలో రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తనకు రాజు హత్యచేసినట్లు తెలియదని.. మద్యం తాగిన తర్వాత రాజు ఎటు వెళ్లాడో తనకు తెలియదని చెప్పాడు. గతంలో రాజుకి నేర చరిత్ర బాగానే ఉందని.. బైక్ దొంగతనాలు చేస్తూ.. జులాయిగా తిరిగేవాడని తేలింది. అంతేకాదు మద్యం సేవించిన తర్వాత సైకోగా ప్రవర్తిస్తాడని.. అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసి వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో తేలింది. నల్గొండ జిల్లాలో ఉన్న రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.