ప్రీలాంచ్ పేరుతో జనం సొమ్ము దోచుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ శర్వాణీ ఎలైట్ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మీ నారాయణ చేతిలో మోసపోయిన బాధితులు పెద్ద ఎత్తున హైదరాబాద్ సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. సీసీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు త్వరగా న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. కాగా, సాహితీ సంస్థ ఎండీ లక్ష్మీ నారాయణ ప్రీలాంచ్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తానంటూ సంస్థ ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. 1700 మంది దగ్గరినుంచి దాదాపు 1539 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు సమాచారం. మోసపోయిన వారిలో డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఎన్నారైలు కూడా ఉన్నారు. దీనిపై ఓ బాధిత వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘ మూడేళ్ల క్రితం జాబ్‌లు చేస్తూ ఉన్నాం. ఇంకా రిటైర్ కాలేదు. మా లాంటి మధ్య తరగతి కుటుంబంలో ఇళ్లు కొనుక్కోవాలనే కలలు అందరికీ ఉంటాయి. మా ఇంటి దగ్గరికే అతడు వచ్చి స్కీమ్ గురించి చెప్పాడు. మార్కెట్ ధర కంటే తక్కువకు ఇళ్లు కట్టిస్తామని, అపార్ట్‌మెంట్స్ కట్టిస్తామని చెప్పాడు. అది కూడా చందా నగర్ నడిబొడ్డున ఇళ్లు కట్టిస్తామని చెప్పాడు.
వీడియోలు, గ్రాఫిక్స్‌తో మమ్మల్ని మభ్యపెట్టాడు. ఒక్కొక్కరిగా అందరినీ బుక్ చేశాడు. చదరపు అడుగు 2200 రూపాయల చొప్పున మూడు ఫ్లాట్‌లు బుక్ చేశాను. నాది మొత్తం కోటి రూపాయల ప్రాజెక్ట్. నా రిటైర్‌మెంట్ అమౌంట్ కోటీ అతడికి ఇచ్చేశాను. మూడేళ్లలో ఇళ్లు కట్టిస్తానన్నాడు. కట్టించి ఇవ్వక పోతే డబుల్ అమౌంట్ తిరిగి ఇస్తానన్నాడు. మాకు అలా అగ్రిమెంట్ కూడా ఇచ్చాడు. చాలా సార్లు మేము ఆయన్ని కలిశాము. తక్కువ మంది ఉన్నపుడు బౌన్సర్లతో బెదిరించేవాడు. ఇప్పుడు అడిగితే డబ్బులు లేవంటున్నాడు. సరిగా సమాధానం కూడా చెప్పటం లేదు’’ అని వాపోయాడు.