భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. చేయడానికి పని లేక.. ఉపాధి లేక.. అర్హతలుండి కొందరు, అర్హతల్లేక మరికొందరు నిరుద్యోగితను ఎదుర్కొంటున్నారు. 2017-18లో 6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు, 201-22 నాటికి 6.50 శాతంగా ఉంది. అభివృద్ధిలో ముందుకు సాగుతున్నా.. నిరుద్యోగ సమస్యను మాత్రం నిర్ములించలేకపోతుంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్లు, నిరుద్యోగులను ట్రాప్ చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఇలాంటి ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా అభ్యర్ధులు జాగ్రత్తలు తీసుకోక కేటుగాళ్ల మాయమాటలకు ఉచ్చులో పడుతున్నారు. తాజాగా, రైల్వే శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ.2 కోట్లకు పైగా టోకరా వేశాడో ఓ కేటుగాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు, విరుదునగర్ జిల్లాకు చెందిన సుబ్బుసామి అనే వ్యక్తి ఎక్స్ సర్వీస్‌మెన్. మంచి వ్యక్తి కూడాను. తమ ఊరి పిల్లలకు, తనకు తెలిసినవారికి మంచి ఉపాధి కల్పించాలని నిత్యం ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఆయనకు కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, డబ్బులు చెల్లిస్తే నిరుద్యోగులకు రైల్వే ఉద్యోగం వచ్చేలా చేస్తానని శివరామన్.. సుబ్బుసామిని నమ్మించాడు. ఇది నిజమేనని నమ్మిన సుబ్బుసామి.. తనకు తెలిసిన ముగ్గురు యువకులను అతని వద్దకు తీసుకొచ్చాడు. ఈ ముగ్గురు కాస్తా.. 28మంది అయ్యారు. వెంటనే శివరామన్ తాను అనుకున్న ప్రణాళికను అములుచేశాడు.
ముందుగా ఉద్యోగం కావాలంటే ఢిల్లీకి రావాల్సిందేనని నిరుద్యోగులను శివరామన్ ఆదేశించాడు. బాధితులను ఒక్కొక్కరిగా ఢిల్లీకి రప్పించాడు. అక్కడ అభ్యర్ధులకు ‘వికాస్ రాణా’ అనే వ్యక్తితో మాట్లాడించాడు. అతడు నార్త్ రైల్వేలో డిప్యూటీ డైరెక్టర్ గా పరిచయం చేశాడు. ఉద్యోగం, ట్రైనింగ్, మెటీరియల్, ఆఫర్‌లెటర్, జాబ్ డిజిగ్నేషన్ ఏంటో క్లుప్తంగా వివరించిన రాణా.. వారి వద్ద నుంచి రూ.2.67 కోట్ల వరకు వసూలు చేశాడు. అనంతరం వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, నకిలీ ఐడీ కార్డులు, ట్రైనింగ్ లెటర్ ఇచ్చి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో ట్రైనింగ్ పేరుతో దాదాపు నెల రోజుల పాటు కూర్చోబెట్టాడు.
ఆ ట్రైనింగ్‌లో రోజుకి 8 గంటల పాటు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకు ఉన్న భోగీలు లెక్కించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం వికాస్ రాణా వారికి ఆఫర్ లెటర్లు అందించాడు. దీంతో సంబరపడిపోయిన నిరుద్యోగులు.. వాటిని తీసుకుని రైల్వే అధికారుల వద్దకు వెళ్లగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుబ్బుసామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రోజుకి 8 గంటల పాటు.. వచ్చే, పోయే రైళ్లు, రైళ్లకున్న బోగీలను లెక్కపెట్టిన ఈ నిరుద్యోగులపై.. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.