ప్రకాశం జిల్లాకు చెందిన రాధా అనే మహిళ హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక హత్య, 100 అనుమానాలు అన్న చందంగా మారింది. ఆమెపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాధా అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇదే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే నిందితులు ఆమెను క్రూరంగా హింసించి ఆ తర్వాత కారుతో తొక్కించి దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మృతురాలు కుటుంబ సభ్యులు మాత్రం.. కాశిరెడ్డి అనే వ్యక్తికి డబ్బు ఇచ్చానని. తిరిగి ఇవ్వాలని అడిగిన కారణంగానే అతడు రాధాను అతి కిరాతకంగా హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హత్య జరిగి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు ఇంత వరకు నిందితులను పట్టుకోకపోవడం విశేషం. ఈ క్రమంలోనే రాధా హత్య కేసులో అనేక అనుమానాలకు తావిస్తుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే రాధా మృతదేహాంపై చాలా చోట్ల తీవ్ర గాయాలు ఉండడంతో ఆమెను హింసించి దారుణంగా హత్య చేశారని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు మత్తు మందు ఇచ్చి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇక ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తుంది. అసలు కాశిరెడ్డి ఎక్కడున్నాడు? నిజంగానే అతడే హత్య చేశాడా? అతనితో పాటు ఎంతమంది ఉన్నారనే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పక్క పోలీసుల తీరుపై మాకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ ఆరోపణలు లేవనెత్తుతున్నారు. కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన చాలా సమయానికి స్పందించారని వాపోతున్నారు. ఇక మొత్తానికి రాధా హత్య కేసు పోలీసులకు కాస్త ఛాలెంజింగానే మారిందని తెలుస్తుంది.
అసలేం జరిగిందంటే?
ప్రకాషం జిల్లా వెల్లగండ్ల మండలం జిల్లెళ్లపాడుకి చెందిన రాధా అనే వివాహిత స్నేహితుడైన కాశిరెడ్డికి గతంలో అప్పుగా రూ.80 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని రాధా, ఆమె భర్త ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దీనికి కాశిరెడ్డి ఇస్తానంటూ రోజులు దాటవేస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ రోజు రాత్రి కాశిరెడ్డి డబ్బులు తిరిగి ఇస్తానంటూ ఓ చోటుకు రమ్మని రాధాకు కాల్ చేసినట్లు సమాచారం. అతడు చెప్పినట్లే రాధా అక్కడికి వెళ్లి శవమై కనిపించింది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.