నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. ప్రతి చిన్న పనికి మొబైల్ అవసరం ఎంతగానో ఉంటుంది. ఈ క్రమంలోనే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు కోసం మొబైల్స్ కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని వీడియో గేమ్స్, అశ్లీల వీడియోలు అంటూ దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు పిల్లలు పబ్జీ ఆటకు బానిసై సైకోలా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ ఆడొద్దని అడ్డుపడితే ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల 14 ఏళ్ల ఓ బాలుడు పబ్జీకి బానిసై తన కుటుంబ సభ్యులందరిని కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లాహోర్ రాష్ట్రంలోని కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్ ముబారక్(45) స్థానికంగా హెల్త్ వర్కర్ గా పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కొన్నేళ్లుగా భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో.. 14 ఏళ్ల కొడుకు కొన్నిరోజులుగా చదువుపై శ్రద్ధపెట్టక.. పబ్జీ ఆటకు బానిసై వికృతంగా ప్రవర్తించడం గమనించింది. ఓ రోజు కొడుకుతో పబ్జీ ఆటను మానేయాలని గట్టిగా హెచ్చరించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న బాలుడు.. అందరూ నిద్రిస్తున్న సమయంలో తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. దీంతో కుటుంబ సభ్యులంతా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
చేసిందంతా చేసి బాలుడు ఏమి తెలియనట్లు ఇంటి టెర్రస్ పైకి వెళ్లి నిద్రించాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. టెర్రస్ పై ఉన్న బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ బాలుడు కాల్పులకు ఉపయోగించిన తుపాకీని కాలువలో పడేసి.. తమ ఇంట్లో వాళ్లు ఎలా చనిపోయారో తనకు తెలియదని చెప్పడం గమనార్హం. చివరికి పోలీసుల తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది.
ప్రభుత్వ అనుమతితోనే నహిద్ ముబారక్.. కుటుంబం రక్షణ కోసం ఆ తుపాకీ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పబ్జీ ఆటను బ్యాన్ చేయాలంటూ నినాదాలు మొదలయ్యాయి. గతంలోనూ ఎంతోమంది యువకులు పబ్జీ కారణంగా ఆత్మహత్యలకు, హత్యలకు పాల్పడ్డారు. ఇలాంటి వీడియో గేమ్స్ యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. వీలైనంత త్వరగా పబ్జీ గేమ్ దేశంలో బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున జనాలు డిమాండ్స్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ దారుణ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.