ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భోజనం పెట్టలేదని భర్త భార్యను క్షణికావేశంలో దారుణంగా కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమునపల్లె. ఇదే గ్రామానికి చెందిన దాసరి చిన్న అంకాలు, బసవమ్మ(35) భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది.
భార్యాభర్తలు స్థానికంగా పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే భర్త అంకాలు తాగుడుకు బానిసై ప్రతి రోజు మద్యం తాగేవాడు. ఇక రోజులాగే భర్త అంకాలు బుధవారం తాగి ఇంటికొచ్చాడు. భోజనం పెట్టాలంటూ భార్యతో ఏకంగా గొడవకు దిగాడు. దీంతో ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగింది. ఇక రాను రాను వీరి గొడవ పతాక స్థాయికి చేరుకుంది. దీంతో భార్యాభర్తలు రాత్రంతా గొడవ పడ్డారు. తెల్లవారు జామున కోపంతో ఊగిపోయిన భర్త క్షణికావేశంలో కర్రతో భార్యపై దాడి చేశాడు.
కర్ర బలంగా భార్య గుండెల్లో గుచ్చుకోవడంతో బసవమ్మ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భోజనం పెట్టలేదన్న కారణంతోనే భర్త భార్యను కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.