నిత్యం ఏదో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే.. ప్రమాదాలకు ప్రధాన కారణం. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ప్రమాదాల్లో గాయపడి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంది. తాజాగా నల్గొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు మార్గం మధ్యలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు 35 మంది ప్రయాణిలకుతో విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఈ ట్రావెల్ బస్సు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. దీంతో బస్సులోని 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో డ్రైవర్ తో సహా ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు వుండగా ..వారిలో చాలామంది సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు ప్రమాదంపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బస్సు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. రోడ్డుపై అడ్డంగా పడిన బస్సును క్రేన్ సాయంతో తొలగించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మరి..ఇలా వివిధ కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.