వివాహేతర సంబంధాల కారణంగా బంగారు జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి. కొందరు వ్యక్తులు తమ స్వలాభం, శారీరక కోర్కెలు తీర్చుకోవటానికి వివాహేతర సంబంధాలను ఆశ్రయిస్తున్నారు. తమ అవసరాలు తీరగానే చేతులు ఎత్తేస్తున్నారు. పెళ్లికి, కలిసుండటానికి బలవంతం చేసే అవతలి వ్యక్తుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోమన్నందుకు ఓ మహిళను హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్‌లోని బాన్సువాడకు చెందిన ఉస్మాబేగం అక్కడి గౌలీగూడలో నివాసం ఉంటోంది. బేగంకు 18 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పెళ్లి నాటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆమెకు యూపీకి చెందిన షెహజాద్ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధంగా మారింది. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. కొద్దిరోజుల క్రితం షెహజాద్ సొంత ప్రాంతం అయిన ఉత్తర ప్రదేశ్‌లోని గజరౌలాకు వెళ్లిపోయాడు. ప్రియుడు దూరం అవ్వటంతో ఆమె విలవిల్లాడిపోయింది. అతడ్ని ఫోన్ ద్వారా సంప్రదించింది. షెహజాద్ ఆమెను యూపీ రమ్మన్నాడు. అతడి మాట ప్రకారమే ఆమె యూపీ వెళ్లింది. అక్కడ ప్రియుడ్ని కలిసి ఎంతో సంతోషించింది. అతడితోనే తన జీవితం అనుకుంది. తనను పెళ్లి చేసుకోమని అతడిపై ఒత్తిడి తెచ్చింది.
అయితే, ఆమెను పెళ్లి చేసుకోవటం అతడికి ఇష్టం లేదు. ఆమెకు పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్పి చూశాడు. ఆమె వినలేదు. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు. బేగాన్ని తాడుతో కట్టేసి ఇటుకతో తలపై విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె చనిపోయింది. ప్రియురాలు చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఓ కంపెనీలో పక్కన పడేసి పోయాడు. పోలీసులకు బేగం మృతదేహం సమాచారం అందింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షెహజాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. ఇక, పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.