ఉన్నతమైన చదువు చదువుకుంది.. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.. నెల నెల జీతం తన బ్యాంక్ లో దాచుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. అనుకోకుండా ఆ యువతి గుండెపోటుతో మరణించింది.. ఆమె ఫోన్ చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయే నిజాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని 45 రోజుల తర్వాత వెలికితీయించి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మిర్యాలగూడ బాపూజీనగర్‌కు చెందిన గోన శ్రీనివాసరావు, యాదమ్మ లకు ఇద్దరు కుమార్తెలు.. వారిలో పెద్దమ్మాయి ప్రవళిక. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ప్రవళిక ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి జీతానికి ఉద్యోగం చేస్తుంది. ఇటీవల తన మేనమామ ఇంటికి వెళ్లింది. అక్కడే ఆమెకు గుండెపోటు రావడంతో దేవరకొండ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మిర్యాలగూడలో ఆమె అంత్యక్రియలు చేశారు.
ప్రవళిక చనిపోయిన కొన్నిరోజుల తర్వాత ఆమె సోదరి ఫోన్ చెక్ చేసింది. తమ కాలనీకి చెందిన పందిరి మహేష్ తో తీసుకున్న ఫోటోలు.. అతనికి పంపించిన డబ్బు వివరాలు ఉన్నాయి. అంతేకాదు ఓ బ్యాంక్ నుంచి రూ.50 వేల లోన్ కూడా తీసుకొని ఈఎంఐ కడుతుంది. తన జీతం మొత్తం బ్యాంక్ లో దాచుకుంటున్నట్లు తెలిపినప్పటికీ.. ఆ డబ్బు మొత్తం మహేష్ కి ఇస్తున్నట్లు తెలుసుకున్నారు.
తన బిడ్డను దారుణంగా మోసం చేసిన మహేష్ పై ప్రవళిక తండ్రి మిర్యాలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవళిక చనిపోయింది చందంపేటలో కనుక ఫిర్యాదు అక్కడ ఇవ్వాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన తర్వాత పోస్టుమార్టం తిరిగి నిర్వహించారు. వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.