తెలంగాణలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన యువతితో పెళ్లికి ఒప్పుకోవాలని కోరినందుకు యువతి కుటుంబ సభ్యులు యువకుడిని దారుణంగా నరికిం చంపారు.
నల్లగొండ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. కొందరు దుండగులు పట్టపగలు నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారంలో గ్రామంలో ఇరిగి నవీన్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి ఇదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా వీరి ప్రేమాయణం ఏకంగా నాలుగేళ్ల పాటు కొనసాగింది.
ఇకపోతే ఇటీవల పెళ్లి చేయాలని భావించి యువతి తల్లిదండ్రులు సంబంధాలు చూశారు. ఈ విషయం తెలుసుకున్ననవీన్ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లికి ఒప్పుకోవాలని కోరాడు. ఇద్దరి కులాలు వేరు కాడంతో యువతి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయితే యువతి తరుఫు బంధువులు ఆదివారం నవీన్ కు ఫోన్ చేసి.. నీతో మాట్లాడాలని కోరారు. దీనికి సరే అన్న నవీన్.. తన ఫ్రెండ్ తో పాటు వారు రమ్మన్న చోటుకు వెళ్లాడు. దీంతో యువతి బంధువుల్లో 9 మంది బైక్ లపై వచ్చారు. ఇక నవీన్ రాకను గమనించిన యువతి కుటుంబ సభ్యులు పట్టపగలు నడి రోడ్డుపై నవీన్ ను కత్తులతో కిరాతకంగా నిరికారు. వీరి దాడుల్లో ఆ యువకుడు రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నవీన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనంతరం మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నల్లగొండ జిల్లాలో కలకలం సృష్టించిన మరో పరువు హత్య ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.